. . . ఆర్డీఎస్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటన
పాలమూరు, బతుకమ్మ :
తెలంగాణకు చెందిన నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం బుధవారం ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించింది. ప్రతినిధి బృందంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డా. సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ ఆంజనేయులు గౌడ్, పార్టీ నాయకులు డా. కురువ విజయ్ కుమార్, హనుమంతు నాయుడు, మహిపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చిక్కాల పర్వి, కురిడి, చిక్కమంచాల ప్రాజెక్టులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ రైట్ కెనాల్ వంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నీటి వాటాపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోపించారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా కాపాడలేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. పాలమూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డీఎస్ నీటి సమస్యపై స్పందించాలని వారు కోరారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చేపడుతున్నట్లు పేర్కొన్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి, వాటిని నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ అంశంపై వెంటనే కెఆర్ఎంబి, సిడబ్ల్యూసి, కేంద్ర జలశక్తి శాఖలకు అధికారిక ఫిర్యాదు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో లక్ష మంది రైతులతో కలిసి ఆర్డీఎస్ ప్రాజెక్టు వద్ద భారీ ఆందోళన చేపడతామని పార్టీ నాయకులు హెచ్చరించారు.
