నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల సూపర్డెంట్ నాగరాజ్, జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో వైస్ ప్రిన్సిపాల్ జలగంతిరుపతిరావు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు వై.ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 2025 మే 20వ తేదీన జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు సమ్మె నిర్వహింస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులపై పని భారం పెంచే విధంగా 12 గంటల పని విధానంతోపాటు, గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చే ఆలోచనలను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. మెడికల్ కళాశాలలో బడ్జెట్ ను పెంచి కార్మికులను పెంచాలని, వీటితోపాటు మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు సంవత్సరానికి 8 జాతీయ, పండుగ, ఆర్జిత సెలవులు ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సిని వెంటనే ప్రకటించి నూతన వేతనాలు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి.హనుమండ్లు, కవిత పాల్గొన్నారు.

