నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఇచ్చిన సమ్మె పిలుపును విజయవంతం చేయాలని కార్మిక సంఘాల సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి వారి హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చారని ఫలితంగా కార్మికులకు భద్రత లేకుండా పోతుందని, కనీస వేతనాలు అమలు జరగవని, పని గంటలు పెరుగుతాయని, మహిళలకు రక్షణ కరువవుతుందని వారు తెలిపారు. అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం వలన గ్రామీణ పేదరికం మరింత పెరిగి పేదలు ఆకలితో అలమటించే పరిస్థితులు వస్తాయనన్నారు. రైతులకు విత్తన చట్టాన్ని మార్చడంతో పాటు, విద్యుత్ సవరణ బిల్లు తేవటం వలన కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చటమే జరుగుతుంది తప్ప రైతాంగానికి ఏమాత్రం ఉపయోగపడదని ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సమ్మెను అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, ప్రజా పందా మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ఆర్.ఎస్.పి జిల్లా నాయకులు బొడా అనిల్ పాల్గొన్నారు.
