- వావి వరుసలు మరిచిన నేటితరం
- వరసకు అన్నతో ప్రేమాయణం
- బావతో పెళ్లి
- పెళ్లినాటి నుండి బావపై కక్ష పెంచుకున్న బామ్మర్ది
- వరుసైన అన్న తో వివాహేతర సంబంధం వద్దన్నందుకే హత్య
- కేసు వివరాలను వెల్లడించిన కామారెడ్డి డిఎస్పి
బతుకమ్మ, మాచారెడ్డి: సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రేమ పెళ్లి వ్యవహారాలు మారిపోతున్నాయి. పెరిగిన సాంకేతిక నైపుణ్యం వావివరసలను పక్కకు నెట్టింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకృష్ణ హత్యోదంతం సినిమాను తలపించింది. వరసకు అన్న, వరసకు బావ ఇద్దరితో ప్రేమాయణం కొనసాగించిన యువతి, చివరకు బావను వివాహమాడింది. కానీ అన్నతో వివాహేతర సంబంధం కూడా నేరిపింది. అదే పాల ఆటో డ్రైవర్ హత్య కు దారి తీసింది.
పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామంలో సోమవారం రాత్రి హత్య కు గురైన మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకృష్ణ (32) హత్య కేసు వివరాలను కామారెడ్డి డిఎస్పి నాగేశ్వరరావు వెల్లడించారు. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకృష్ణ, వినయ్ లు అన్నా చెల్లెళ్ల కొడుకులు. వీరిద్దరూ కలిసి అదే గ్రామానికి చెందిన ఒకే అమ్మాయిని ప్రేమించారు. వినయ్ కి అమ్మాయి వరసకు చెల్లెలు కాగా బాలకృష్ణకు మరదలు వరుస అవుతుంది. ఆమె వరస ప్రకారమే బాలకృష్ణను ప్రేమ వివాహమాడినప్పటికీ అన్నవరసైన వినయ్ తో ప్రేమాయణం కొనసాగిస్తూ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది నచ్చని బాలకృష్ణ భార్య మనసు ను మార్చుకుందామని పలుమార్లు ఆమెకు ఇది పద్ధతి కాదని కౌన్సిలింగ్ నిర్వహించాడు. దినదినం భార్య భర్తల మధ్య గొడవలు తారస్థాయికి చేరడంతో , పెళ్లినాటి నుండే బావ పై కక్ష పెంచుకున్న బామ్మర్ది, అడ్డు తొలగిస్తే పని అయిపోతుందని పక్కా ప్లాన్ తో బాలకృష్ణ ను వినయ్ తన ఇద్దరు మిత్రులతో కలిసి హత్య చేశారు. కరీంనగర్ డైరీలో పాల ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న బాలకృష్ణను ఇసాయిపేట – అన్నారం రోడ్డులో ఈకో వాహనంలో వెంబడించి ఆటోను ఆపి బాలకృష్ణని కిందికి దింపారు. తువ్వాలతో మెడకు చుట్టి హత్య చేశారు. అనంతరం ఒక చెట్టుకు తాడుతో వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.