. . . ఎన్ సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రస్తుత తరానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని క్రీడల వల్ల వాటిని నేర్చుకోవచ్చని ఎన్.సి.సి. అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి అన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల నాగారంలో శుక్రవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కళాశాల ఎన్ సీసీ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమ వారోత్సవాలు – క్రీడలు అనే అంశంపై ఎస్ సీసీ కేడెట్ల కోసం అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులకు ప్రేరణాత్మకమైన ఉపన్యాసం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఉల్లాసం కలుగుతాయని అన్నారు. గెలుపు ఓటములను తట్టుకునే ఆత్మస్థైర్యం కలుగుతుందని, కష్టకాలంలో కూడా సానుకూల దృక్పథంతో ఉండాలని ప్రోత్సహించారు. కష్టపడిన శ్రమ ఎప్పటికీ వృథా కాదని ప్రేరణ కలిగించారు. క్యాడెట్లకు క్యారమ్, చెస్ వంటి ఇండోర్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.సయీదా జైనబ్, వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు, అధ్యాపకులు శిరీష, కో- ఆర్డినేటర్, ఎన్. సి.సి. అధికారిణి లెఫ్టినెంట్ జి.భార్గవి, ఎన్ సీసీ కేడెట్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.