- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ : భూభారతి చట్టం అమలులో భాగంగా ఎంపిక చేసిన లైసెన్సుడ్ సర్వేయర్లకు సోమవారం నుండి శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో లైసెన్సుడ్ సర్వేయర్లు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లను ఎంపిక చేసి, వారికి శిక్షణ అందించి అర్హత సాధించిన వారికి లైసెన్సులను జారీ చేయనుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగిన 300 మందిని శిక్షణ కోసం ఎంపిక చేశామని అన్నారు. 50 రోజుల పాటు వీరికి భూముల సర్వేలో నిష్ణాతులు, అనుభవజ్ఞులైన వారిచే శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. భూభారతి చట్టంలో పొందుపర్చిన 5, 7, 8 సెక్షన్ ల ప్రకారం భూముల క్రయవిక్రయాలు, సక్సేషన్ వంటి వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్ లను రూపొందించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వ్యవసాయ భూములకు కూడా సర్వే మ్యాప్ లను జతచేయాలని భూభారతి చట్టంలో పొందుపర్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు లైసెన్సుడ్ సర్వేయర్లు సర్వే జరిపి భూముల హద్దులు, సమగ్ర వివరాలతో సర్వే మ్యాప్ లను సమర్పిస్తే, వాటిని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి ఆమోదించిన మీదట పట్టా పాస్ బుక్ కు జతచేయడం జరుగుతుందని తెలిపారు. పట్టా పాస్ బుక్కులు కలిగిన రైతులు ఎవరైనా సరే సర్వే మ్యాప్ కోసం దరఖాస్తు చేసుకుని, లైసెన్సుడ్ సర్వేయర్లచే సర్వే చేయించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి భూమి పార్సిల్ కు ఆధార్ తరహాలో భూధార్ నెంబర్ ను కేటాయించనుందని, దీని కోసం కూడా లైసెన్సుడ్ సర్వేయర్ల సేవలు అవసరం అవుతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ సందర్భంగా నేర్పించే అంశాలను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. లైసెన్స్ సర్వేయర్లకు గెట్టు, భూమి హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కులు తదితర అంశాలపై థియరీ క్లాసులతో పాటు క్షేత్రస్థాయిలో చెయిన్ సర్వే, మ్యాప్ రీడింగ్ వంటి వాటి గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. భూ సంబంధిత సమస్యలలో అత్యధికంగా సర్వేతో ముడిపడిన అంశాలే ఎక్కువగా ఉన్నందున లైసెన్సుడ్ సర్వేయర్లు చక్కగా సేవలందిస్తే, అనేక భూ సమస్యల దరఖాస్తులు పరిష్కారం అవుతాయని, తద్వారా భూ వివాదాలకు తావు లేకుండా చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందని అన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏమాత్రం సంశయానికి లోను కాకుండా వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. 50 రోజుల పని దినాలలో కొనసాగే శిక్షణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తానని అన్నారు. భూభారతి చట్టం గురించి అవగాహన ఏర్పర్చుకుని, భూముల సర్వే విధానాన్ని సమగ్రంగా నేర్చుకుంటే లైసెన్సుడ్ సర్వేయర్ గా చక్కటి ఆదాయ వనరులను పొందవచ్చని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జూలై 28, 29 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయిన లైసెన్సుడ్ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డీ అశోక్, ఇన్స్పెక్టర్ కిషన్, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
