27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాజకీయాల్లో పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటేనే మార్పు తీసుకురాగలం

 

. . . తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం హిమాయత్ నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన “చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన సభ”లో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహించాలని కవిత సూచించారు. మహిళా రిజర్వేషన్ల కోసం మన శక్తిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. బిల్లు అమలు చేయకపోతే ఓట్లు వేయమని మహిళలంతా గట్టిగా చెప్పే పరిస్థితి రావాలని ఆమె అన్నారు. మహిళలు రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. రాజకీయాల్లో పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటేనే మార్పు తీసుకురాగలం. అందుకే మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు తప్పనిసరి అని ఆమె అన్నారు. మహిళల కోసం పార్టీ పెట్టి రాజకీయాల్లో అడుగు ముందుకు వేశానని పేర్కొన్న కవిత, మహిళలు గర్వపడేలా మంచి రాజకీయాలు చేస్తాను. మహిళల కోసం ధైర్యంగా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించినప్పటికీ అమలులో జాప్యం జరుగుతోందని ఆమె విమర్శించారు. 2022-23లో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని, పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చ జరగాలని 18 పార్టీలను కలిపామని గుర్తుచేశారు.  దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగి బిల్లు ఆమోదం పొందింది. కానీ ఇప్పుడు అది పోస్ట్ డేటెడ్ చెక్‌లా మారిందని వ్యాఖ్యానించారు. మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని కొందరు యువ మహిళా నాయకులు అభిప్రాయపడుతున్నారని, అయితే మహిళలు ఒక స్థాయి వరకు ఎదిగిన తర్వాత అడ్డంకులు ఎదురవుతాయని కవిత అన్నారు. అందుకే చట్టపరమైన రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు. ఓబీసీ మహిళలు, మైనార్టీ మహిళలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఓబీసీలకు చట్టపరమైన రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు చట్టపరంగా 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు టికెట్లు ఇవ్వడం సరిపోదని కవిత అన్నారు. ఒక పార్టీ మహిళలకు ఎక్కువ టికెట్లు ఇస్తే మిగతా పార్టీలు కలిసి ఆ పార్టీని ఓడించే పరిస్థితి ఉంటుంది. అందుకే మహిళలకు చట్టపరమైన రిజర్వేషన్లు తప్పనిసరి అని అన్నారు. తమ పార్టీ తరఫున మహిళలకు కనీసం 33 శాతం టికెట్లు కేటాయిస్తామని, సరైన నాయకత్వం ఉన్న మహిళలు ఉంటే 50 శాతం టికెట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కవిత తెలిపారు. మహిళల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ అమలును ఎన్నికల అంశంగా మార్చాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా బిల్లు అమలు చేయకపోతే ఓట్లు వేయమని చెప్పే ఉద్యమం రావాలి. అందుకు ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని అన్నారు. మహిళలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కవిత సూచించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

 

Let us organize a massive meeting at Delhi's Ramlila Maidan for women's reservation.

More articles

Latest article