. . . సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
. . . సిపీఎం ఆధ్వర్యంలో ఘనంగా బహుజనుల రాజు చత్రపతి శివాజీ జయంతి
కామారెడ్డి, బతుకమ్మ :
శివాజీ పోరాటం రాజ్య స్థాపన లక్ష్యమే కానీ మత రాజ్యాన్ని స్థాపించడం కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. దానిలో భాగంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి శివాజీ వీరోచిత పోరాటం చేశాడని అన్నారు. ఆ పోరాటంలో శివాజీ కూడా కుల వివక్షకు గురయ్యాడని, ఆయన పట్టాభిషేకానికి పీష్వా బ్రాహ్మణులు ముందుకు రాకపోవడంతో కలకత్తా నుండి గంగాభట్ అనే బ్రాహ్మణుని పిలిపించి శివాజీ ఉన్న బరువు గల బంగారం ఇస్తేనే పట్టాభిషేకం చేస్తామని అనడంతో బంగారం ఇచ్చిన కూడా కాలి బొటన వేలుతో తిలకం దిద్ది పట్టాభిషేకం చేశారని గుర్తు చేశారు. అంతటి శివాజీ మహారాజ్ నే వివక్షకు గురిచేసిన చరిత్ర పీస్వా బ్రాహ్మణులదని అన్నారు. శివాజీ చేసిన పోరాటం అణచివేయబడ్డ ప్రజల కోసం, మరాఠా సామ్రాజ్య కోసం చేశారని కేవలం ఒక మతం కోసం కాదని అన్నారు. ఆయన సైన్యంలో సర్వ సైన్యాధ్యక్షులుగా ముస్లింలను నియమించారని అది అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. బహుజనుల ఆరాధ్య స్ఫూర్తి చత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకట్ గౌడ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ముదం అరుణ్, భారతీయ విద్యార్థి మోర్చా నాయకులు విట్టల్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాహుల్, నితిన్, సాయి, నవీన్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
