. . . విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి వినీల్ కుమార్
బిచ్కుంద, బతుకమ్మ :
మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె. వినీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి వినీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు విధులను కూడా తెలుసుకోవాలని సూచించారు. నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న పలు చట్టపరమైన అంశాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పోక్సో చట్టం-2012 గురించి వివరిస్తూ చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు ఈ చట్టం రూపొందించబడిందని తెలిపారు. చిన్నారులపై ఎలాంటి దాడులు జరిగినా వెంటనే 1098 చైల్డ్‌లైన్ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అలాగే మోటార్ వెహికల్ చట్టంపై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లు వాహనాలు నడపడం నేరమని హెచ్చరించా రు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా, కాలుష్య ధ్రువీకరణ పత్రాల ప్రాముఖ్యతను వివరించారు. సైబర్ నేరాలపై విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవడం, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, నకిలీ ప్రొఫైల్స్ వల్ల ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను వివరించారు. సైబర్ నేరానికి గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అందుబాటులో ఉందని, అవసరమైన వారు మండల న్యాయ సేవా సంస్థలను సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశం పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చట్టపరమైన బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు లక్ష్మణ్ రావు, మల్లేశం, కళాశాల అధ్యాపకులు, పోలీస్ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
