27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భూభారతి అర్జీలను వేగంగా పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ :  భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, రెండు రోజుల్లో అర్జీలు పరిష్కారం కావాలని అన్నారు. సాదాబైనామా ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం లక్ష్యం నెరవేరేలా అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. చిన్నచిన్న కారణాలతో సాదాబైనామా అర్జీలు తిరస్కరించకూడదని సూచించారు.  ప్రభుత్వ మార్గదర్శకాలు తు.చ తప్పకుండా అమలు చేయాలని, దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులను వెంటనే సబ్ కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలకు ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. కాగా, ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాల మ్యాపింగ్ ను తప్పిదాలకు తావు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Land claims should be resolved quickly.

More articles

Latest article