మాక్లూర్, బతుకమ్మ :
ఉపాధి హామి కూలీలకు 100 రోజుల పని కాకుండా 200 రోజుల పని కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. బుధవారం మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఐద్వా ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ చిన్నాపూర్ గ్రామంలో ఉపాధి కూలీలకు టెంట్ సౌకర్యం కల్పించాలన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కూలీ రేట్లు మాత్రం ఒక రూపాయి కూడా పెరగట్లేదని, కాబట్టి 300 రూపాయలు కాకుండా 600 రూపాయలు కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేబర్ కార్డు సౌకర్యం ఉన్న ప్రతి ఉపాధి కూలీ కి పని భద్రత, ప్రమాద బీమా కల్పించాలని, వారి కుటుంబానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పల్లెపు వెంకటేష్, పార్టీ సభ్యులు చిన్న సాయిలు, చిన్నాపూర్ ఐద్వా గ్రామ కమిటీ సభ్యులు శారద, రాధా, లక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు.