. . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లను తీసుకు రావడం వలన కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ రమేష్ బాబు అన్నారు. బుధవారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జరిగిన సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రమ శక్తి నీతి 2025 పేరుతో తెచ్చిన విధాన పత్రం బిజెపి యొక్క స్వభావాన్ని అర్థం చేస్తుందని అన్నారు. మనుశాస్త్రం, కు అనుగుణంగా కార్మిక వర్గం వ్యవహరించాలని కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం కార్మికులు యజమానుల యొక్క దయ, దాక్షిణ్యం పై ఆధారపడాలని చెప్తున్నారని కార్మిక శాఖలో ఉన్న అధికారాలను కోత పెట్టడమే కాకుండా దాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుందని ఆయన విమర్శించారు. కార్మిక చట్టాల సవరణ పై కానీ, శ్రమ శక్తి నీతి 2025 విధాన పత్రం కానీ ప్రజలు బహిరంగంగా చర్చించకుండా కనీసం పార్లమెంటులో కూడా చర్చించకుండా నిర్ణయం చేయడం అంటే కార్మిక వర్గాన్ని చులకన చేయడం అవుతుందని తెలిపారు. కార్మిక విధానాలపై గతంలో కేంద్ర కార్మిక సంఘాలతో, ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో చర్చించి నిర్ణయించేవారని నేటి బిజెపి ప్రభుత్వం కేవలం యాజమాన్యాల ప్రయోజనాల కోసం మాత్రమే ఎవరితో చర్చించకుండా నిర్ణయించటం జరిగిందని తెలిపారు. నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి నెలలో జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు చేయడం వలన కార్మిక వర్గం యాజమాన్యానికి కట్టు బానిసలుగా మార్చే ఫ్యూడల్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని ఎనిమిది గంటల పనిని తొలగించి 12 గంటలకు మార్చడం వలన కార్మిక వర్గం జీవితకాలం ఆయుష్షు తగ్గుతుందని అనారోగ్యాల పాలవుతారని దీని మూలంగా ప్రజలలో తీవ్ర అసమానతలు ఏర్పడతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలి లేనియెడల కార్మికుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గణేష్, కార్తీక్, బుచ్చన్న, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
