బాన్సువాడ, బతుకమ్మ :
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యాన్ని పరామర్శించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబెర్, మాజీ జడ్పీటీసి రత్నా కుమార్, మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, కౌన్సిలర్లు ఖలీల్, ఫెరోజ్ ఖాన్, రమేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

