కొత్వాల్ లేక యాక్షన్ కు బ్రేక్
📰 Generate e-Paper Clip
- గాడితప్పుతున్న పోలీసు శాఖ
- కొత్త కమిషనర్ నియామకం ఎప్పుడో?
- ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటారా?
- బదిలీ అయిన పోలీసు సిబ్బందిని రిలీవ్ చేస్తారా లేదా
- టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై అనుమానాలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండడంతో సంబంధిత పోలీసు శాఖలో పట్టు సడలింది. పోలీసు శాఖ బాస్ లేకపోవడంతో ఇంచార్జి ఉండడంతో అధికారులు ఎవరిని ఖాతరు చేయడం లేదు. ఇటీవల నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ తర్వాత పోలీసు శాఖలో కింది స్థాయి అధికారుల్లో జవాబుదారితనం లోపించింది. ప్రధానంగా కమిషనర్ గా కల్మేశ్వర్ హయంలో జరిగిన బందోబస్తు సంబంధిత యాక్షన్ లు పెండింగ్ లో ఉండిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందాకు సహకరించిన ఇద్దరు సిఐలు, ఏడుగురు ఎస్సైల జాబితాను గడిచిన నెలలో డీజీపీ కార్యాలయం నిజామాబాద్ కమిషనరేట్ కు పంపింది. వారిని బదిలీ చేసి లూప్ లైన్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆకస్మికంగా కమిషనర్ కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై పంపడంతో అవి పెండింగ్ లో ఉండిపోయాయి. సీపీ కల్మేశ్వర్ బదిలీకి వారం ముందు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీని అటాచ్ చేయడంతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. ఇటీవల ఏసీపీని సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ గా కల్మేశ్వర్ ఉన్న సమయంలో ఈ నెల 14,15 తేదిల్లో 97 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేసిన విషయం తెల్సిందే. అందులో చాలా మట్టుకు కోర్టు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ళు, ఏఎస్సైలను ఇప్పటి వరకు రిలీవ్ చేయలేదు. వారిని కొనసాగించేందుకు ప్రస్తుతం ఉన్న ఎస్ హెచ్ వోలు, సిఐలు ప్రయత్నించడం విశేషం. ముదుర్లుగా, వసూళ్ళ రాయుళ్ళుగా పేరున్న వారిని బదిలీ చేసినా కమిషనర్ లేకపోవడంతో రిలీవ్ చేయకుండా అడ్డుకోవడం విశేషం. కమిషనర్ గా కల్మేశ్వర్ ఉన్న సమయంలో అవినీతిని ప్రక్షళన చేయడానికి గాను టాస్క్ ఫోర్స్ లో పని చేస్తున్న ఇద్దరుకానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతో పాటు ఏడుగురిని బదిలీ చేశారు. ఏసీపీని అటాచ్ చేయగా తర్వాత సస్పెండ్ అయిన విషయం తెల్సిందే. దాంతో టాస్క్ ఫోర్స్ అనేది లేకుండాపోయింది. ఇంచార్జి పోలీసు కమిషనర్ ను నియమించిన ఇప్పటి వరకు టాస్క్ ఫోర్స్ నియామకాల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. దాంతో నిజామాబాద్ లో ఇల్లీగల్ దందాలు మళ్ళీ షురూ అయ్యాయి. స్థానిక పోలీసులతో మిలాఖత్ అయిన ఇసుక వ్యాపారులు ఇసుక రవాణా చేస్తుండగా పీడీఎస్ బియ్యం దందా బహిరంగంగా సాగుతుంది. మట్కా, పేకాట స్థావరాలు ఓపెన్ గా కొనసాగుతున్నాయి. దీపావళి కావడంతో పేకాట వారోత్సవాలు ముందే ప్రారంభమయ్యాయి. గుట్కా, గంజాయి క్రయవిక్రయాల దందా కొనసాగుతుంది. కొత్త బాస్ నియామకం పై సందిగ్ధం ఉండడంతో ఇటీవల ఆరోపణలు వచ్చినా డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిన 9 మందిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు లేకపోవడంతో వారిని బదిలీ చేస్తారా. కొనసాగిస్తారని సంశయాలు వ్యక్తమౌతున్నాయి. 97 మంది సిబ్బందిలో సగానికి పైగా రిలీవ్ కాకపోవడంతో వారిని రిలీవ్ అవుతారా లేదా అనేది అనుమానాలున్నాయి. కొత్త కొత్వల్ నియామ కం దీపావళి వరకు జరుగుతుందని చెబుతున్నారు. కానీ ఇక్కడ పని చేసేందుకు రాజకీయ ఒత్తిళ్లను తట్టుకునే వారు ఎవరు ఆసక్తి చూపడం లేదన్న వాదనలున్నాయి. నాన్ క్యాడర్ ఐపీఎస్ కమిషనర్ గా తెస్తారన్న వాదనలున్నాయి. కొత్వాల్ లేక పనులన్నీ పెండింగ్ ఉన్నాయని పోలీసు శాఖలో టాక్ నడుస్తోంది.
You cannot print contents of this website.