ఢిల్లీ, బతుకమ్మ : లోక్ సభలో పలు కీలక బిల్లులను బుధవారం మంత్రులు ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధాని, సీఎం ఉద్వాసన బిల్లు ను హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, కేంద్రమంత్రి నైనా పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. తీవ్రమైన నేరారోపణకు గురై అరెస్టు అయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రుని పదవి నుంచి తొలగించేందుకు ఈ కొత్త బిల్లు ఉపకరిస్తుంది. కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టై నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31 వ రోజున వారి పదవి పోయేలా నిబంధనలను ఈ బిల్లులో పొందుపరిచారు. అలాగే జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే కీలక బిల్లును కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో మరింత పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.