29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐటిఐ శిక్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
  • కలెక్టర్ తో కలిసి ప్రభుత్వ బాలుర ఐటిఐని సందర్శించిన ఎమ్మెల్యే

 

నిజామాబాద్, బతుకమ్మ : విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక శిక్షణ సంస్థలను నిరుద్యోగ, యువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన గురువారం నిజామాబాద్ పట్టణంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ బాలుర ఐ.టి.ఐను సందర్శించారు. టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనో తదితర ట్రేడ్ లకు సంబంధించిన వర్క్ షాప్ లు, తరగతులకు వెళ్లి నిశిత పరిశీలన జరిపారు. వివిధ ట్రేడ్ లలో అందిస్తున్న శిక్షణ తీరు గురించి, అందుబాటులో ఉన్న యంత్ర పరికరాల గురించి ప్రిన్సిపాల్ యాదగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐ.టి.ఐ లలో చేరిన వారికి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులతో మమేకమై, వారికి అందిస్తున్న శిక్షణ తీరుతెన్నుల గురించి వాకబు చేశారు. స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి.ఐ శిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు.  వీటికి అనుసంధానంగా నేటి పారిశ్రామిక ఆవసరాలకు అనుగుణంగా అధునాతన కోర్సులలో శిక్షణ ఇప్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లను కూడా ప్రభుత్వం నెలకొల్పిందని గుర్తు చేశారు. ఐటిఐ లలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రైల్వే, బీడీఎల్, మిధాని వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, సొంతగా పరిశ్రమలు స్థాపించుకునేందుకు, ప్రైవేట్ రంగంలో ఆకర్షణీయ వేతనాలతో బహుళ జాతి పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, యువతలో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచాలని కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన వారు నేరుగా ఐ.టి.ఐ లలో ప్రవేశాలు పొంది, తాము ఎంచుకున్న కోర్సులలో శిక్షణ పొంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లేస్ మెంట్ ల కోసం టాటా వంటి ప్రముఖ కంపెనీలతో కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఐ.టి.ఐ ఇన్స్ట్రక్టర్ లు ఉన్నారు.

Job and employment opportunities with ITI training

More articles

Latest article