25.1 C
Hyderabad

కబ్జాలు తొలగించడం వరకేనా?

Is it limited only to removing encroachments?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఖిల్లా వద్ద 13 గుంటల భూమిని అరకోటికి అమ్మేసిందెవరూ?

 

. . . అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ కు రూ.50 లక్షలకు కుచ్చుటోపి

 

. . . కోట్ల రూపాయల శిఖం భూమిని చెరబట్టింది పచ్చపార్టీ నేతనేనా?

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలో ఈ నెల 15, 16 తేదిల్లో రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, నీటి పారుదల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన కబ్జాలను తొలగించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, తహసీల్ధార్లు, టౌన్ ప్లానింగ్ అధికారులను జేసీబీలతో ఖిల్లా ప్రాంతంలో 13 గుంటల ప్రభుత్వ భూమికి కబ్జా చెర నుంచి విడిపించారు. అదే మాదిరిగా అర్సపల్లి రామ్మర్తి చెరువు వద్ద సుమారు 600 గజాల్లో జరిగిన కబ్జాను కూల్చివేశారు. ఖిల్లా రోడ్డులో దాదాపు ఏడాది కాలంగా జరుగుతున్న కబ్జా ఉదంతాన్ని రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు. రామ్మర్తి చెరువు వద్ద చేపట్టిన 600 గజాల భూమి చుట్టు రేకుల షెడ్డును ఏర్పాటు చేసినా కన్నెత్తి చూడలేదు. దాంతో కబ్జారాయుళ్లు సంబంధిత భూమిని అమ్మకానికి పెట్టేశారు. రిజిస్ట్రేషన్ జరుగడమే తరువాయి అని కోట్ల రూపాయలకు బేరసారాలు నిర్వహించారు. అయితే ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించడంతో కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాదారుల చెర నుంచి విముక్తి అయ్యాయి. కానీ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటారా? అని సంశయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన నేతలు, వారి సన్నిహితుల ఆధ్వర్యంలో జరుగుతున్న కబ్జాలపై అధికార యంత్రాంగం చర్యలపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నేత చేపట్టిన కబ్జాను ఈ నెల 15న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించారు. నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ ఏడాది కాలంగా ఖిల్లా ఈద్గా ప్రాంతంలో 2545 సర్వే నంబర్ లోని 13 గుంటల భూమిని చెరబట్టాడు. సంబంధిత సర్వే నంబర్ లో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా స్మశనం కాకుండా మిగిలిన స్థలం ఒకప్పుడు బల్ధియా డంపింగ్ యార్డుగా ఉండేది. స్థానిక కాలనీకి చెందిన ఒక సీనియర్ నేత పక్కన ఉన్న ఒక పట్టా భూమి సంబంధించిన దస్తావేజులతో డాక్యుమెంట్ తయారు చేసి ఏడాది కాలంగా దాన్ని చెరబట్టాడు. తనచేతికి మట్టి అంటకుండా మాజీ కార్పొరేటర్ ను ముందుంచి తతంగం నడిపారు. ఈ వ్యవహరంలో దాదాపు అర కోటి చేతులు మారినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ జరుగడమే తరువాయి కోట్ల రూపాయల లాభం వస్తుందని, కొందరు సిండికేట్ గా మారి అధికార పార్టీ నేత చేతుల్లో అరకోటిని అప్పనంగా అప్పగించారు. అక్కడికి మీడియా రాకుండా చూస్తామని కొందరు దళారులు రూ.5 లక్షలు నొక్కేసినట్లు తెలిసింది. ప్రజా సంఘాలు అటువైపు వెళ్లొద్దని మేనేజ్ చేస్తామని, రిజిస్ట్రేషన్ జరుగగానే వాటాలు ఇస్తామని నమ్మబలికినట్లు తెలిసింది. కానీ చివరకు కలెక్టర్ చొరవతో కబ్జా చెర వీడడంతో 13 గుంటల భూమి కోసం లక్షలు పెట్టినవారు లబోదిబోమంటున్నారు. అధికార పార్టీ నేతను నమ్ముకుని లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే ప్రభుత్వ భూమి అని అధికార యంత్రాంగం లాక్కోవడంతో గగ్గొలు పెడుతున్నారు. తాము పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.

నగర శివారులోని అర్సపల్లి రామ్మర్తి చెరువు వద్ద సుమారు 600 గజాల స్థలాన్ని ఒక పచ్చపార్టీ నాయకుడు చెరబట్టినట్లు తెలిసింది. రామ్మర్తి చెరువు సుమారు 29 ఎకరాల్లో విస్తరించి ఉండేది. నిజాంసాగర్ కాలువ ఏర్పాటుకు ముందే గొలుసుకట్టు చెరువు ద్వారా రామ్మర్తి చెరువు నీళ్ళతో నిండి ఉండేది. రామ్మర్తి చెరువు కింద అర్సపల్లి, మాలపల్లి, సారంగాపూర్, కసాబ్ గల్లి ప్రాంతాలకు చెందిన రైతుల వ్యవసాయ భూములు ఉండేవి. రామ్మర్తి చెరువు పై భాగంలో ఇళ్ళు నిర్మాణం జరుగడంతో చెరువులోకి నీరు రావడం గగనంగా మారింది. అదే సమయంలో అర్సపల్లి ప్రాంతంలో సాగు తగ్గిపోవడంతో రామ్మర్తి చెరువు కబ్జాలతో కుచించుకపోయింది. రెవెన్యూ రికార్డులో ఇప్పటికి 29 ఎకరాల భూమి శిఖం భూమిగా చూపుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో పచ్చపార్టీ తరపున ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తి శిఖం భూమిలో దాదాపు 600 గజాల భూమి చుట్టురా పెన్సీంగ్ వేయడం విశేషం. మొన్నటి వరకు సమీపంలో 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నని రోజులు కబ్జాలకు బ్రేక్ పడింది. స్టేషన్ తరలించగానే మళ్ళీ అక్కడ కబ్జాల పరంపర పెరిగింది. గతంలో బల్ధియా అధికారులు చెరువు శిఖంను కాపాడేందుకు వేసిన శిఖంను తొలగించి కబ్జాలు చేస్తున్నా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. పేదలకు సంబంధిత భూములలో వార్డు బ్లాక్ లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు వాదనలున్నాయి.

Is it limited only to removing encroachments?

More articles

Latest article