24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పీఎఫ్​ ఖాతాదారులకు “ఏటీఎం” వరమా..? శాపమా..?

Must read

📰 Generate e-Paper Clip

  • ఈపీఎఫ్​వో సంస్థ నిర్ణయం పట్ల మేధావుల ఆందోళన
  •  మధ్యతరగతి భవిష్యత్తుకు షరాఘాతం అంటూ విమర్శలు
  • ఈపీఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం సౌకర్యాన్ని కల్పించొద్దంటున్న కార్మిక సంఘాలు

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : పీఎఫ్​ ఖాతాదారులు ఏటీఎం నుంచి నగదు తీసుకునే సదుపాయం తీసుకొస్తామని గతంలో ఈపీఎఫ్ఓ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 2026 నుంచి ఈ సదుపాయం అమలులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ బోర్డు సభ్యులు అక్టోబర్​ రెండో వారంలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఆన్​లైన్​ ద్వారా క్లెయిమ్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు పాక్షికంగా నగదు విత్​డ్రా చేసుకోవచ్చు. అయితే పీఎఫ్​ ఖాతా  నుంచి మాత్రమే నగదు తీసుకునే వీలు ఉంటుంది. పెన్షన్​ విభాగంలో జమైన డబ్బులు తీసుకోరాదు. ఉద్యోగం మానేసిన వారు మాత్రం మొత్తం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది.

  • ఏటీఎం ద్వారా డ్రా చేస్తే నష్టం ఏమిటి..?

పిఎఫ్ అంటేనే భవిష్య నిధి. పేద, మధ్యతరగతి కార్మికులు, నిరుద్యోగులు మలిసంధ్యలో చేతగాని వయసులో తమకు అండగా ఉండేందుకు ఈ భవిష్య నిధిని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. పిఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయాలంటే ఆన్లైన్ విధానం ద్వారా లేదా పిఎఫ్ ప్రధాన కార్యాలయంకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం ద్వారా నగదు విడ్రా చేసుకునే సౌకర్యం ప్రస్తుతం ఉంది అయితే దీనికి పలు నిబంధనలు ఉండడంతో అత్యవసరమైతే తప్ప పిఎఫ్ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం లేదు. అయితే ప్రస్తుతం ఇలా ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తే రిటైర్మెంట్ వరకు పిఎఫ్ ఖాతాలో ఉండాల్సిన మొత్తం ఉండకుండా ఎప్పుడు పడితే అప్పుడు నగదు డ్రా చేసుకోవడం  ద్వారా కార్మికులు,చిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా లేకుండా పోతుంది.ఇది మధ్యతరగతికి అనవసరంగా కొనుగోలు శక్తిని పెంచి ప్రభుత్వాలు టాక్స్ లు పెంచుకునేలా, కార్పొరేట్ శక్తులు తమ వ్యాపారాలను పెంచుకునేలా కుట్రలు పన్నుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పాక్షికంగా నగదు విత్​ డ్రా కోసం ఏటీఎం ద్వారా సైతం అవకాశం కల్పించాలని కేంద్ర కార్మిక శాఖ  నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండా ఎలాంటి ప్రాసెస్ అవసరం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సులభంగా నగదు డ్రా చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం ఇంట్లో ఉండే చిన్న చిన్న అవసరాలకు సైతం ఈపీఎఫ్ నుంచి డబ్బు డ్రా చేసుకునే ఆలోచన వస్తుంది. తద్వారా భవిష్యనిధి ఖాతాలో సొమ్ము నిలువ లేకుండా పోతుంది!!  రిటైర్మెంట్ వయసులో ఖాతాలో సరైన నిల్వలు లేకపోవడంతో రిటైర్ అయిన కార్మికులకు చిరుద్యోగులకు ఆర్థిక భరోసా ఉండదు!!  ప్రస్తుతం మానవ సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. ఇక మునుముందు భవిష్య నిధి ఖాతాలో సరైన నగదు నిల్వలు లేకపోతే ఆ వృద్ధులను పట్టించుకునేది ఎవరని కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మానవ సంబంధాలు కనుమరుగైన  తరుణంలో తమ సంతానం పట్టించుకోకపోయినా తమ భవిష్య నిధి ఖాతాలో దాచుకున్న సొమ్ము తమకు మలిసందెలో అండగా ఉంటుందని ఇప్పుడు ఇలా ఏటీఎం ఇస్తే అనవసరమైన ఆడంబరాలకు సైతం నగదును విత్ డ్రా చేసి అనవసర ఖర్చులు చేయాల్సి వస్తుందని కార్మికులు, చిరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ఈపీఎఫ్ఓ అంతా సిద్ధం..

ఏటీఎం నుంచి పీఎఫ్​ డబ్బులు తీసుకునే సౌకర్యాన్ని జూన్​ నుంచే తీసుకు రావాలని కేంద్ర కార్మిక శాఖ అధికారులు భావించారు. ఈ మేరకు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా సిద్ధం చేశారు. అయితే ఎంత మొత్తం తీసుకోవాలనే పరిమితి విషయంలో బోర్టు ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సి ఉంది. దీని కోసం నిర్ణయాన్ని వాయిదా వేశారు. అక్టోబర్​లో జరిగే సమావేశంలో నగదు విత్ డ్రా లిమిట్​పై చర్చించిన అనంతరం జనవరి నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీని కోసం ఏటీఎం కార్డు మాదిరి కార్డులను కూడా అందించనున్నారు.

  • పేద మధ్యతరగతి వాళ్ళ భవిష్యత్తు కుదేలవుతుంది.
  • కుంట గంగాధర్, తెలంగాణ ఐకెపి సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు.

ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఈపీఎఫ్‌వోకు ఉన్న 7.8 కోట్లమంది చందాదారుల భవిష్యత్తు ఆ గమ్య గోచారం కానంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు సరైన పెన్షన్స్ సౌకర్యం లేదు, అలాంటిది తమ భవిష్య నిధి ఖాతాలో దాచుకున్న సొమ్మును ఇలా ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే వేసులుబాటు కల్పిస్తే కార్మికులు, చిరు ఉద్యోగులు చిన్నచిన్న అవసరాలకు సైతం తన భవిష్య నిధిలోని సొమ్మును రిటైర్మెంట్ కు ముందే ఖర్చు చేయించాలని కార్పొరేట్ స్థాయిలో కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇలా చేయడం ద్వారా చిరు ఉద్యోగులు, కార్మికుల యొక్క కొనుగోలు శక్తిని అవసరం లేకున్నా పెంచాలని కుట్ర జరుగుతోంది. తద్వారా రిటైర్మెంట్ అయ్యాక తమ భవిష్యనిధి ఖాతాలో ఇంతకుముందు ఉన్నంత సొమ్ము ఉండదు. ఒకపక్క వెయ్యి రెండువేల పెన్షన్ మాత్రమే పిఎఫ్ ఖాతాల ద్వారా వస్తోంది.  అలాంటిది తమ భవిష్యనిది ఖాతాలో నిర్ణీత సొమ్ము కూడా లేకపోతే మలిసంద్యలో ఎలాంటి ఆసరా ఉండదు. అసలే మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో రిటైర్ అయ్యాక వృద్ధులను వారి పిల్లలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. వారి భవిష్యత్తుకు భరోసా లేకుండా పోతుంది తద్వారా కార్మికులు చిరుద్యోగుల యొక్క భవిష్యత్తుకు ఈ నిర్ణయం ఆశానిపాతం లా మారుతుంది. కావున కేంద్ర కార్మిక సంస్థ వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కార్మికులకు చిరుద్యోగులకు సైతం రిటైర్మెంట్ సమయానికి ఉన్న వేతనంలో 75% వేతనాన్ని పెన్షన్ గా ఇచ్చే నిర్ణయాన్ని ఈపీఎఫ్ఓ సంస్థ తీసుకోవాలి. అప్పుడు ఈ ఏటీఎం సౌకర్యాన్ని కల్పించినా కూడా మలిసంధ్య లో ఆర్థిక భరోసా కు ఎలాంటి డోకా ఉండదు. కావున ఆదిశగా నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రస్తుతానికి పీఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం సౌకర్యం కల్పించడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు ఉద్యమ దిశగా సత్వరమే స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

More articles

Latest article