నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్(ఎస్డీపీ) యంత్రాన్ని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎస్డీపీ యంత్రం ఏర్పాటుతో రోగి అవసరాన్ని బట్టి ఒకే దాత నుంచి ప్లేట్‌లెట్లను సేకరించడం సులభంగా సాధ్యమవుతుందని అన్నారు. ఈ యంత్రం ఖరీదు సుమారు రూ.40లక్షల వరకు ఉంటుందన్నారు. ఒక సారి ప్లేట్ లెట్లు తయారు చేయడానికి ఉపయోగించే పరికరాల విలువ సుమారు రూ.15వేల వరకు ఉంటుందన్నారు. ప్లేట్‌లెట్లు ఒక గంటలో రక్తం నుంచి విడుదలవుతాయన్నారు. రక్తదాత 72 గంటల తర్వాత మళ్లీ ప్లేట్‌లెట్లను దానం చేయొచ్చని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా రోగిలో ప్లేట్‌లెట్ల సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు పెరుగుతుందన్నారు. ఆర్డీపీ టెక్నిక్‌లో, గ్రహీతకు బ్లడ్ బ్యాంక్ నుంచి మ్యాచింగ్ గ్రూప్ ప్లేట్‌లెట్స్ ఇవ్వబడతాయని తెలిపారు. కానీ ఎస్డీపీ ద్వారా ఏ బ్లడ్ గ్రూప్ వారైనా రక్తదానం చేయొచ్చన్నారు. కార్యక్రమం లో డాక్టర్ ఇమ్రాన్ అలీ (పాథాలజీ), చందు బ్లడ్ బ్యాంక్ ఇన్ చార్జి, వైద్యులు పాల్గొన్నారు.
