కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో తక్కువ బరువుతో జన్మించిన ఆడ శిశువును నియోనాటల్ 108 అంబులెన్స్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్య సహాయం అందించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన హన్మంతు సంతోషి తన మూడో కాన్పులో భాగంగా శస్త్రచికిత్స ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు తక్కువ బరువుతో జన్మించడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, సరిగా ఏడవకపోవడం, నీరసంగా ఉండటం వంటి సమస్యలు కనిపించాయి. శిశువు పరిస్థితిని మెరుగుపరిచేందుకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం సాయంత్రం 7:30 గంటలకు నియోనాటల్ 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ కృష్ణ స్వామి, పైలట్ మహేష్‌లు శిశువును జాగ్రత్తగా తరలించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే సమయానికి శిశువు ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శిశువు తండ్రి నవీన్, అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించి సేవలు అందించిన నియోనాటల్ 108 సిబ్బంది పనితీరుపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.
