29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఈ నెల 17న “ఇందూర్ రణభేరి”

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ మెంట్ నిధుల విడుదలలో నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17 న ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ (పాత కలెక్టరేట్) వద్ద “ఇందూర్ రణభేరి” కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఇందూర్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని దినేష్ పటేల్ పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో దాదాపు రూ.11 వేల కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద విద్యార్థుల విద్యా భవిష్యత్తును మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని దినేష్ పటేల్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, కార్పొరేటర్ శ్రవణ్, బీజేపీ ఐటీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, నాయకులు అంబదాస్ రావు, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ గౌడ్, విపుల్ రావు, రాజ్ గణేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article