- ఉమ్మడి జిల్లా సమీక్షలో జిల్లా ఇంచార్జి మంత్రి కితాబు
- భూభారతి, రాజీవ్ యువ వికాసం, ఖరీఫ్ సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం
నిజామాబాద్, బతుకమ్మ : యాసంగి -2025 సీజన్ లో వరి ధాన్యం సేకరణతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో నిజామాబాద్ జిల్లా ముందంజలో నిలువడం అభినందనీయమని ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని ప్రశంసించారు. గురువారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి ఇంచార్జి మంత్రి జూపల్లి కీలక అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. యాసంగిలో వరి ధాన్యం సేకరణ, త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, భూభారతి అమలు తీరు, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలతో పాటు తాగునీరు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. శాసన సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అన్ని శాఖలకు చెందిన ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా అంశాల వారీగా వివరాలను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇంచార్జి మంత్రి దృష్టికి తెచ్చారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో 4 .19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా, 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. దీంతో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని 700 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష్యానికి మించి ఇప్పటివరకు 8.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిపామని తెలిపారు. ఇందులో 80 శాతానికి పైగా 7.27 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం ఉందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ. 1907 కోట్లు కాగా, రైతుల ఖాతాలలో రూ. 1816 కోట్ల బిల్లు మొత్తాలను జమ చేయడం జరిగిందన్నారు. మరో 90 కోట్ల బిల్లు మొత్తాలను మూడు రోజులలో జమ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముందస్తు రుతుపవనాల రాక వల్ల కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం కొంత వరకు తడిసిందని, అయినప్పటికీ తడిసిన లక్షా 36 వేల బస్తాల ధాన్యాన్ని సైతం రైతుల నుండి సేకరించి మిల్లులకు తరలించామని అన్నారు. ఇంకనూ 60 వేల వరకు ధాన్యం బస్తాలను మిల్లులకు చేర్చాల్సి ఉందని వివరించారు. గత సంవత్సరం యాసంగిలో 4.25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా, ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో సేకరించామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 426 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.77 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వివరించారు. 116 మిల్లులకు ధాన్యం నిల్వలను కేటాయించామని, రైతులకు 822 కోట్ల రూపాయల మేర బిల్లుల చెల్లింపులు జరిపామని, గతేడాది కంటే ఈసారి యాసంగిలో 30 శాతం అధికంగా ధాన్యం సేకరణ జరిగిందని అన్నారు. దీనిపై ఇంచార్జి మంత్రి జూపల్లి స్పందిస్తూ, ధాన్యం సేకరణలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపడం వల్ల పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిగిందని, ప్రభుత్వం సన్నాలు క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తుండడం వల్ల రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నారని హర్షం వెలిబుచ్చారు. ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరినందున, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చివరి గింజ వరకు కూడా సజావుగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించి సకాలంలో మిల్లింగ్ జరిగేలా చూడాలన్నారు. కాగా, ఇదివరకు ధాన్యం నిల్వలు కేటాయించినప్పటికీ సీ.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్ల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ రికవరీ యాక్టుతో పాటు నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని, అవసరమైతే సదరు మిల్లులను వేలం వేసి సీఎంఆర్ నిధులను రాబట్టే దిశగా చర్యకు తీసుకోవాలని ఆదేశించారు. డిఫాల్ట్ మిల్లులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై చర్చ సందర్భంగా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మినహా మిగతా సెగ్మెంట్లలో ఆశించిన విధంగా మంజూరీలు ఉన్నాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3569 మందికి ఇళ్లను మంజూరు చేయగా, 991 మంది నిర్మాణాలను ప్రారంభించారని, 454 నిర్మాణాలు బేస్మెంట్ దశను, 60 మంది గోడల నిర్మాణ దశలను పూర్తి చేసుకోగా వారికి నిబంధనలకు అనుగుణంగా డబ్బులు కూడా చెల్లించడం జరిగిందని అన్నారు. కాగా, లబ్దిదారులకు ఇసుక, మొరం వంటివి అందుబాటులో ఉండేలా చూడాలని, ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్దిదారులను ప్రోత్సహించాలని సూచించారు. గత ప్రభుత్వ అసంబంద్ధ విధానాల వల్ల తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 22 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ. 6 వేల కోట్ల సబ్సిడీని, మరో రూ. రెండు వేల కోట్లు బ్యాంకు లింకేజీ కింద అందిస్తున్నామని అన్నారు. రైతులకు 22 వేల కోట్ల రుణ మాఫీ వర్తింపజేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్రవంలోని తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 మాసాలలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలులోకి తేవడం జరిగిందన్నారు. కాగా, రాజీవ్ యువ వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి, నిరుద్యోగ యువతకు బాసటగా నిలువాలని ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని ఇప్పటికే పైలెట్ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినందున, జూన్ 3 నుండి అన్ని మండలాల్లో విజయవంతంగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కాగా, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లో స్లమ్ ఏరియాలలో నివసించే నిరుపేదలకు భూ సేకరణ జరిపి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాలలో నివాసాలు ఉంటున్న వారిని గుర్తించి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా ఉచితంగా ఇసుక సరఫరా జరిగేలా, తక్కువ ధరకు ముడి సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తాగునీటి పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

