28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయ భవనాలపై సౌర విద్యుత్  ఫలకాల ఏర్పాటు, ఉపాధి హామీ కూలీలచే పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగింపు, ఈజీఎస్ కాంపోనెంట్ మెటీరియల్ పనుల పురోగతిపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ ఏ.ఈలు, ఏపీఓ లు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. పై అంశాలలో ప్రగతి గురించి ఒక్కో మండలం వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాల వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన  కొత్త లబ్దిదారులకు ఇళ్లను మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా కొత్త లబ్దిదారులకు తెలియజేస్తూ, అందరూ మార్కింగ్ చేసుకుని నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని అన్నారు. లబ్దిదారులకు సెర్ప్, మెప్మా ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా చొరవ చూపాలన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను వెంటనే గుర్తించి జాబితాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. కాగా, ఇటీవల భారీ వర్షాలకు ఇసుక మేటలు వేసిన ఆరు మండలాల్లోని పంట పొలాల్లో ఉపాధి హామీ కూలీలతో ఇసుక మేటలు తొలగింపజేయాలని అన్నారు. పనుల జాతరలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరీ తెలిపిన మేజిక్ సోక్ పిట్లు, పశువుల కొట్టాలు, వర్మీ కంపోస్ట్ తదితర నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా మరోసారి క్షేత్రస్థాయిలో కార్యాలయాల భవనాలను పరిశీలించి, సమగ్ర వివరాలతో నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీఓ సాయాగౌడ్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఈ.ఈ నివర్తి, డీపీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి జె.గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Indiramma should speed up the construction of houses

More articles

Latest article