25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జూలై 6 న ఛలో కలెక్టర్‌కు బీఎల్పీ పిలుపు

 

. . . బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేద కుటుంబాలకు వెంటనే ఇంటి స్థల పట్టాలు మంజూరు చేసి, ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 6న నిర్వహించే “ఛలో కలెక్టర్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని దొడ్డి కొమురయ్య కాలనీ, ఫూలే అంబేద్కర్ నగర్, సుందరయ్య కాలనీ, బందగి నగర్‌తో పాటు జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూలి పనులు, అసంఘటిత రంగ ఉపాధులపై ఆధారపడి జీవిస్తున్న వేలాది పేద కుటుంబాలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో గుడిసెలు కూలిపోవడం, వేసవిలో తీవ్రమైన ఎండ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాల లేమితో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్లో ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలను ఆక్రమణదారులుగా కాకుండా వారి జీవన వాస్తవాలను గుర్తించి చట్టబద్ధమైన ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయాలని ఆమె కోరారు. పేదలను బలవంతంగా ఖాళీ చేయించడం కాకుండా వారి గృహ హక్కును పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే జిల్లావ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న అర్హులైన పేద కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అనంతరం వారికి ఉచితంగా ఇంటి స్థల పట్టాలు అందజేసి, వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కోరారు. ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదని, అది ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, మహిళలకు రక్షణ, పిల్లల భవిష్యత్తుకు పునాది అని సబ్బని లత పేర్కొన్నారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమ రాజ్య లక్ష్యాల సాధనలో గృహ హక్కు కీలకమని అన్నారు. ఈ సందర్భంగా బీఎల్పీ జిల్లా కమిటీ ప్రధానంగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయడం, ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం, పేదలను బలవంతంగా ఖాళీ చేయకుండా గృహ హక్కును చట్టబద్ధంగా రక్షించడం, కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, పారదర్శకంగా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరింది. విలేకరుల సమావేశంలో బీఎల్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లీ మధు, నగర ఉపాధ్యక్షుడు హైమద్ ఉసేన్, నగర నాయకురాలు రాధా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article