- వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రపంచ యవనికపై భారతదేశాన్ని అగ్రభాగాన నిలపాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జులై 17, 18 వ తేదీలో ఎంపవరింగ్ ఇండియా 2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే జాతీయ అంశంపై రెండు రోజుల సదస్సు బ్రోచర్‌ను వైస్- ఛాన్స్లర్, ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.టీ. యాదగిరిరావు మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న స్వతంత్ర భారతాన్ని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగాలలో అభివృద్ధిని పరిగెత్తించి ప్రపంచ యవనికపై అగ్ర భాగాన నిలబెట్టుటకుఈ జాతీయసెమినార్ రోడ్ మ్యాప్ గా ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో పర్యావరణ కాలుష్యం వలన జనబాహుల్యానికి ఏర్పడిన అనేక అవరోధాలను నిరోధించుటకు గ్రీన్ టెక్నాలజీ ఉపయోగాన్ని, యువతలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి, సామాజిక న్యాయం తో సమ్మిళిత వృద్ధి సవాళ్లకు ఈ సెమినార్ సరియైన పరిష్కారాలను కనుగొనాలని ఆశిస్తున్నానన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య. ఎం. యాదగిరి మాట్లాడుతూ దేశీయ ఉత్పత్తి విలువను 50 ట్రిలియన్లు సాధించడానికి దృష్టి సారించి, అంతర్జాతీయ వాణిజ్యంలోని కీలక అంశాలను చర్చించే లక్ష్యం గా ఈ సదస్సును నిర్వహించాలన్నారు. అంతేకాకుండా ఈ సదస్సు లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, బిగ్ డేటా మరియు ఆటోమేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల గురించి ప్రముఖ విద్యావేత్తలు మరియు పరిశ్రమ నిపుణుల ముఖ్య ప్రసంగాలు ఈ సదస్సు లో ఉండాలని , ఫలితంగా ఆర్థిక కార్యకలాపాల పెంపు ప్రక్రియలు, డిజిటల్ సాధనాల పురోగతితో, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణాన్ని ప్రభావితం చేసే కీలక రంగాలను చర్చించడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులను ఒకచోట చేర్చడం అభినందనీయమన్నారు. ఈ సదస్సు లో పరిశోధకలకు ,విద్యావేత్తలకు, విద్యార్థులకు పత్రాలను సమర్పించే అవకాశం ఉందని దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్లో తెలిపామని సెమినార్ కన్వీనర్ డాక్టర్ ఏ పున్నయ్య తెలిపారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణలో సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, కో కన్వీనర్ డా టి. సంపత్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పాత నాగరాజ్, డాక్టర్ స్వప్న, డా. సి హెచ్.శ్రీనివాస్, డాక్టర్ వి దత్త హరి పాల్గొన్నారు.
