. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గ్రామ పంచాయతీల వారీగా క్షయ నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తూ నూతన కేసులను గుర్తించాలని, క్షయ రహిత గ్రామాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని క్షయనియంత్రణ సిబ్బందితో డిఎంహెచ్ఓ ఛాంబర్ లో గురువారం క్షయ సిబ్బంది పనితీరుపై, లక్ష్యాల సాధన పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్షయ రహిత సమాజమే మన అందరి లక్ష్యం అన్నారు. జిల్లాలో క్షయ నియంత్రణ యూనిట్ల వారీగా కేటాయించిన లక్ష్యాలను, పూర్తి చేసిన వాటిని, ఆన్లైన్లో నమోదు చేసిన వాటిని, పెండింగ్లో ఉన్న వాటిని సిబ్బంది వారిగా సమీక్షించారు. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లో పెండింగ్ లో చాలా కేసులు ఉన్నాయని, వాటన్నింటినీ నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ శిబిరంలో ఇంకా హెచ్ఐవి, హెచ్ బిఎస్ ఏజీ, వైడల్, హెచ్ బి, బిపి, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా.దేవి నాగేశ్వరి, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డిపిసి లక్ష్మణ్, నరేష్, రవి గౌడ్, వినోద్, క్షయ సిబ్బంది పాల్గొన్నారు.
