. అనర్హులకు ఉద్యోగాలు
. భర్తీ చేసిన ఉద్యోగాలను రద్దు చేయాలంటున్న టీఎన్ఎస్ ఎఫ్ నాయకులు
. కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ పేరుతో మ్యాన్ పవర్ సర్వీసెస్ బాధ్యులు లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మెడికల్ కళాశాలలో ల్యాబ్ అటెండెంట్స్ – 15, డాటా ఎంట్రీ ఆపరేటర్ – 07, రేడియోగ్రఫీ టెక్నిషియర్ – 03, సిటీ స్కాన్ టెక్నిషియన్ 03, ఈసీజీ టెక్నిషియన్ – 02, అనస్తీషియ టెక్నిషియన్ – 04, దోభి – 04, ఎలక్ట్రిషియన్ – 02, ప్లంబర్ 01, డ్రైవర్ – 01, థియేటర్ అసిస్టెంట్ – 02, గ్యాస్ ఆపరేటర్ – 02, వార్డ్ బాయ్ – 04 పోస్టులను భర్తీ చేసేందుకు కామారెడ్డి మ్యాన్ పవర్ సర్వీసెస్ అనుమతి పొందింది.
పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటనలు సైతం ఇచ్చింది. అయితే పోస్టుల భర్తీ పేరుతో సదరు సంస్థ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిందని, రోస్టర్ నిబంధనలను తుంగలొతొక్కి ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టారని టీఎన్ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు, జహీరాబాద్ పార్లమెంట్ టీఎన్ఎస్ ఎఫ్ ఇన్ చార్జి బొండ్ల అంజల్ రెడ్డి ఆరోపించారు.
ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు సైతం వెబ్ సైట్ లో అందుబాటులో ఉండగా, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు బయటకు రాకపోవడం సదరు నాయకుల ఆరోపణలకు బలాన్నిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 50 మందిని మెడికల్ కళాశాలలో నియమించి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
జిల్లాకు చెందిన యువత, నిరుద్యోగులు అక్రమ నియామకాలపై ప్రశ్నించకపోతే భవిష్యత్ లో డబ్బులు ఉన్న వారికే ఉద్యోగాలు ఇస్తారని, ఇప్పటికైనా అప్రమత్తం కావాలని పలువురు పేర్కొంటున్నారు. మెడికల్ కళాశాలలో నియామకాలపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అక్రమ నియామకాలను రద్దు చేయని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు చేస్తామని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అంటున్నారు.
