. . . నిత్యం ఆలస్యంగానే కంప్యూటర్ ఆపరేటర్ విధులకు హాజరు
. . . రెవెన్యూ కార్యాలయంలో రెగ్యులర్గా ఇదే తంతు
కోటగిరి, బతుకమ్మ :
రెవెన్యూ కార్యాలయంలో ఆన్లైన్ వ్యవహారాలు జరగాలంటే కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేంతవరకు నిత్యం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కోటగిరి రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నటువంటి సదరు వ్యక్తి నిత్యం ఆలస్యంగా విధులకు హాజరవ్వడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. మారుతున్న కాలానుగుణంగా పోటీ ప్రపంచంలో ప్రభుత్వ కార్యాలయాలలో పనులను సులభతరం చేసేందుకు పెన్నులకు పని చెప్పకుండా స్మార్ట్ వర్క్ పేరిట ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ శాఖలలో ఆన్లైన్ సర్వీసులను అందుబాటులో ఉంచిన విషయం అందరికీ తెలిసిందే. రెవెన్యూ కార్యాలయాలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, ధరణి తదితరుల విభాగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వేగవంతంగా అందించేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి త్వరితగతిన పనులను పూర్తి చేస్తుంటే కోటగిరి తహసిల్దార్ కార్యాలయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సదరు వ్యక్తి నిత్యం ఆలస్యంగానే విధులకు హాజరవుతున్నారని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కొన్ని కొన్ని సందర్భాలలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విధులకు గైర్హాజరు అవుతున్నాడని తెలిసింది. శుక్రవారం రోజున కంప్యూటర్ ఆపరేటర్ అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ అధికారులను సమాచారం కోసం అడగగా పొంతనలేని సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉంది.
. . . గతంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన లబ్ధిదారులు
గతంలో రేషన్ కార్డ్ ల విషయంలో సిబ్బంది తో లబ్ధిదారులు వాగ్వాదానికి దిగిన విషయం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డ్ కోసం నెలల తరబడి దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా ముడుపులు చెల్లించిన వారికీ వారం రోజుల వ్యవదిలోనే రేషన్ కార్డు రావడం పై పలువురు లబ్ధిదారులు సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. కోటగిరి మండల కేంద్రంలోని ఆన్లైన్లో మీసేవ సెంటర్ల ద్వారా ఒక్కొక్క రేషన్ కార్డుకు 2000 రూపాయల వరకు వసూలు చేసి ఆన్లైన్ సెంటర్ యజమాలతో పాటు జిల్లా సివిల్ సప్లై ఆఫీస్ వరకు లింకులు ఉన్నట్లు సమాచారం. ఈ తతంగానికి తహసీల్దార్ కార్యాలయం నుండి వ్యవహారాలు నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ కార్యాలయంలో ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తమ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
