మోర్తాడ్, బతుకమ్మ: బిఆర్ఎస్ ప్రభుత్వం,ప్రశాంత్ రెడ్డి హాయంలో ప్రాథమిక సహకార సంఘాలన్ని నిర్వీర్యమయ్యాయి, కడ్తా పేరుతో దోపిడీ చేసి పంచుకున్నారు.. రైతులకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రశాంత్ రెడ్డిదే.. అని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయాయని తెలిపారు. 10 సంవత్సరాల కడ్తా పేరుతో రైతులను దోచుకొని దాచుకున్నారని ఇప్పుడు ఏమీ తెలియని సుద్దపూసల్ల ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గం లోని సొసైటీలు సహకార బ్యాంకుకు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని ఆ బకాయిలను ప్రశాంత్ రెడ్డి కట్టించాలని పేర్కొన్నారు. సహకార బ్యాంకుకు సొసైటీలు బకాయిలు ఉండడం ద్వారా ఇప్పుడు ఎరువుల కోసం డబ్బులు కట్టించినా ఆ పాత బకాయిలనే బ్యాంకు కట్ చేసుకుంటుందని దీనంతటికీ బాధ్యత ప్రశాంత్ రెడ్డిదేనని ఆయన తెలిపారు. ప్రభుత్వం కావలసినంత ఎరువులను సరాపర చేసేందుకు సిద్ధంగా ఉందని దాదాపు 13000 టన్నుల యూరియా నిజామాబాద్ లోని గోదాములలొ సరఫరాకు సిద్ధంగా ఉందని సొసైటీలు బకాయిలు ఉన్నందున నిబంధనల ప్రకారం సహకార సంఘాలకు కావాల్సినంత ఎరువులు రావడంలేదని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 9 సొసైటీలపై విచారణ జరుగుతుంటే కేవలం బాల్కొండ నియోజకవర్గం లోని అందులో ఎనిమిది సొసైటీలు ఉన్నాయని ఇది చాలా సిగ్గుచేటు అని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి హయంలో పెద్ద ఎత్తున సొసైటీలలో అక్రమాలు జరిగాయన్నదానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఎవరో చెబితే విచారణ జరిగదని 2/3 మెజారిటీ సభ్యులు లేదా 20 శాతం మంది విచారణ జరపాలని కోరితేనే విచారణ జరుగుతుందని తెలిపారు. 10 సంవత్సరాలు దోపిడీ వల్ల సహకార సంఘాల పై ప్రజలకు నమ్మకం పోయిందని ఇప్పుడు రైతులే నడుంబిగించి తమ తమ సొసైటీల పరిధిలో బకాయిలు ఉన్న డబ్బులను యాజమాన్యాలను ఒత్తిడి చేసి కట్టించాలని అన్నారు. రైతులు ప్రేక్షక పాత్ర వహిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని 10 సంవత్సరాల దోపిడీని కక్కించాలని ఆయన కోరారు. రైతులు ముందుకు వస్తేనే తిరిగి ప్రాథమిక సహకార సంఘాలు పునర్వైభవాన్ని దక్కించుకుంటాయని ఆయన తెలిపారు. ప్రశాంత్ రెడ్డి ఒక పెద్ద దోపిడీదారు అని ఆయనకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. ఇప్పటికే కేవలం 18 నెలల కాలంలో రైతుల సంక్షేమం కొరకు లక్ష కోట్ల రూపాయలను ఖర్చుపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని రాబోవు కాలంలో ఐదు లక్షల కోట్ల రూపాయలు రైతుల సంక్షేమ కొరకు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన వివరించారు. 10 సంవత్సరాల కాలంలో రైతులకు బిందు సేద్యం కొరకు కనీసం డ్రిప్ఇరిగేషన్ కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులను బిందు సేద్యం వైపు మరలిస్తు సబ్సిడీ ద్వారా డ్రిప్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
