29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

భీంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా

Must read

📰 Generate e-Paper Clip

. . .దళిత మహిళల ఆత్మహత్యాయత్నం

 

​. . .అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఒంటిపై డీజిల్ పోసుకున్న బాధితులు

 

​. . .అడ్డుకున్న పోలీసులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

 

బాల్కొండ, బతుకమ్మ :  

 

బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ కేంద్రం వద్ద చేపట్టిన నిరసన రణరంగంగా మారింది. గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నా అధికారులు కనికరించడం లేదంటూ 10వ వార్డుకు చెందిన ఇద్దరు దళిత మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అధికారుల మొండి వైఖరిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేపట్టిన ఈ నిరసనతో మంగళవారం కార్యాలయం  ప్రాంగణంలో హైడ్రామా నెలకొంది. తమ వార్డులోని సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గత కొన్ని రోజులుగా బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చి కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా అధికారులు చేయకపోవడంతో మహిళలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. న్యాయం జరగని పక్షంలో ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ వారు మంగళవారం కార్యాలయం ముందే డీజిల్ బాటిళ్లతో చేరుకున్నారు.

Hydrarama at Bheengal Municipal Office

 

మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న మహిళలు ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్న డీజిల్ ను ఒంటిపై పోసుకున్నారు. నిప్పు అంటించుకునే లోపే అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. బాధితులను వెంటనే అడ్డుకుని,వారి చేతుల్లోని డీజిల్ బాటిళ్లను లాక్కున్నారు. పోలీసుల సకాలంలో స్పందించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన అనంతరం బాధితులు మాట్లాడుతూ.. “మేము దళితులమని మా సమస్యలను పట్టించుకోవడం లేదు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ప్రాణాలు పోయినా సరే మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు” అని హెచ్చరించారు.విషయం తెలుసుకున్న భీంగల్ మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను అదుపులోకి తీసుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. వారి సమస్యలను విన్న అధికారులు, పరిష్కరిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ బాధితులు ససేమిరా అన్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Hydrarama at Bheengal Municipal Office

More articles

Latest article