మానవత సదన్ పిల్లలకు పిండి పదార్థాల పంపిణీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డిచ్పల్లి మండలంలోని మానవత సదన్‌లో ఉన్న పిల్లల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి పిల్లలకు పిండి పదార్థాలు, తీపి పదార్థాలు, అరటి పండ్లను పంపిణీ చేశారు. అలాగే ఆడ పిల్లలలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలు డప్పు వాయిద్యాలు మోగిస్తూ, కోలాటాలు ఆడుతూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అంతా పండుగ వాతావరణంలో ఆనందోత్సాహాలతో కొనసాగింది. సమాజంలోని నిరుపేద పిల్లలకు పండుగ ఆనందాన్ని పంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సంస్థ సభ్యులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
