. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి
. ఉన్నత పరిష్కారం చూపాలి
. దోషులగా తేలితే ఎన్నికల్లో పోటీపై జీవితకాల నిషేధం విధించాలి
. సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, బతుకమ్మ: క్రిమినల్ కేసులు ఉన్న వారు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. క్రిమినల్ కేసులు ఉన్న వారు ఉద్యోగాలకు అనర్హులైనప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాలం నిషేధం విధిచాలని అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిల్ పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్ మోహన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న 42 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, చాలా మంది ప్రజాప్రతినిధులు విచారణకు హాజరుకాకపోవడంతో కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఉన్నత పరిష్కారం చూపాలని సూచించింది. సుప్రీం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ర్టాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.
