మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఎన్నికలలో అధ్యక్షుడిగా గెలుపొందిన బి.సాయన్న ను మండలంలోని దళిత సంక్షేమ సంఘం, అంబేడ్కర్ యువజన సంఘం, ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం సంయుక్తంగా ఘనంగా సన్మానించారు. శనివారం మోర్తాడ్ ఫూలే విగ్రహం సాక్షిగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏవైఎస్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పాత్రికేయులకు కనీస సౌకర్యాలు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో పాత్రికేయులకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించేందుకు పూర్తి “ఉచిత బస్ సౌకర్యం” ఉందని, కొన్ని రాష్ట్రాల్లో నైతే “పెన్షన్” సౌకర్యం కూడా ఉందన్నారు. ఐతే రాష్ట్రంలో అడగకముందే అందరికీ అన్ని ఇస్తున్న ప్రభుత్వం, అర్హులైన పాత్రికేయులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ నెలకు కనీసం “20వేల రూపాయల పెన్షన్” పథకాన్ని అమలు చేయాలన్నారు. అలాగే అర్హులైన వారికీ ఇండ్లు నిర్మించి ఇచ్చి వారి ఫ్యామిలీలను ఆదుకోవాలని అంగుళి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జర్నలిస్ట్ మామిడి రాజు, జాంబవ చమార్ సత్కారమూర్తి సాయన్నకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో నాయకులు రాజారెడ్డి, గంగాధర్, బండ ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
