- ఏసీపీ ఎల్.రాజావెంకట్ రెడ్డి
నిజామాబాద్ క్రైం, బతుకుమ్మ : సొంత మామ ఇంటికే కన్నవేసి 8తులాల బంగారు ఆభరణాలను దొంగిలించిన నేరస్తున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ ఎల్.రాజావెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన వివరాలను వెల్లడించారు. నగరంలోని నాలుగో టౌన్ పరిధిలోని రోటరీ నగర్ లో సభావత్ సక్కుబాయి నివాసం ఉంటుంది. ఈనెల 9న ఉదయం తన ఇంటికి తాళం వేసి వారి ఇంటి దగ్గరలో ఉండే తన కూతురును ఇంటివైపు చూడమని చెప్పి కామారెడ్డికి తన బంధువులను పరామర్శించడానికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో తన కూతురు ఫోన్ చేసి ఇంటి తెలుపులు తెరిచి ఉన్నాయని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన సక్కుబాయి ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడం చూసి లోపలికి వెళ్లి చూడగా సుమారు 8తులాల బంగారు ఆభరణాలు బంగారం పెద్ద గొలుసు, బంగారం నెక్లెస్, కొంత బంగారం చోరీకి గురైందని గుర్తించింది. వెంటనే నగరంలోని నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నాలుగో టౌన్ సబ్ ఇన్స్ పెక్టర్ కె.శ్రీకాంత్ విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా సక్కుబాయి సొంత అల్లుడు ధరావత్ సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. దీంతో సంతోష్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 8తులాలల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ కేసే ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించి నేరుస్థులను పట్టుకున్న నిజామాబాద్ సీఐపి జి.శ్రీనివాస్ రాజ్, నాలుగవ టౌన్ ఎస్ఐ కే.శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
