25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే

Must read

📰 Generate e-Paper Clip

  • జీవో నంబర్ 9పై కూడా
  • నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

 

 హైదరాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై కూడా స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై సైతం స్టే విధిస్తూ నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల బుధవారం నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టి రిజర్వేషన్ అమలు చేసినట్లు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై గురువారం ఆయన వాదనలు వినిపించారు. బీసీ కులగణన చేపట్టాలని కేబీనెట్ నిర్ణయించిందన్నారు. సర్వేలో బీసీ జనాభా 57.6 శాతం ఉందని తేలిందన్నారు. కులగణన మేరకు బీసీ రిజర్వేషన్లపై బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. ఆ బిల్లును రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టారన్నారని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెల్సిందే. దీనికి వ్యతిరేకంగా మాదవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టు ఆశ్రయించారు. ఆయనతో పాటు బీసీ సంఘం నాయకులు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్  ఇంప్లిడ్ పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం సంబంధిత కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని పిటిషనర్లు పేర్కొన్నారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో తీసుకువచ్చారని పిటిషనర్లు బుధవారం వాదించారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్ అమలు చేస్తోందని పేర్కొన్నారు. ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజరవేషన్లపై చట్టం చేయలేవని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై గురువారం రవివర్మ వాదనలు వినిపిస్తూ 50 శాతం మించి రిజర్వేషన్ల పెంపునకు సరైన కారణాలు ఉన్నాయన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే పిటిషనర్లు, ప్రభుత్వం వాదనలు విన్న న్యాయస్థానం జీవో నంబర్ 9పై స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, రెండు వారాల్లో కౌంటర్ వేయాలని పిటిషన్ కు సూచించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించనుంది.

More articles

Latest article