హైదరాబాద్,బతుకమ్మ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదా వేసింది. తెలుగు మీడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదని పలువురు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రలు ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించమన్నారు. హైదరాబాద్ లోని కోఠి పరీక్ష కేంద్రం నుంచి ఎక్కువ మంది ఎంపిక అయ్యారనేది అవాస్తవమన్నారు. గ్రూప్ వన్ పరీక్షలో 9.95 శాతం తెలుగు మీడియం అభ్యర్థులు, 89.88 శాతం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు, 0.1 శాతం ఉర్దూ మీడియం అభ్యర్థులు ఉన్నారన్నారు. అందరికీ నిపుణులు ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేసినట్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎవల్యూయేటర్ కు ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. టీజీపీఎస్సీ నుంచి వివరాలు తీసుకొని సీల్డు కవర్లో సమర్పిస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు.