- పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడాన్నీ విరమించుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. పీడీఎస్యూ, ఇతర విద్యార్థి నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గిరిరాజ్ కళాశాల ముందు దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ 1973 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు హైదరాబాద్ నగరానికి జీవవైవిద్యంగా, హైదరాబాద్ ప్రజలకు ఆక్సిజన్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుందని ప్రకటించారన్నారు. కానీ ఈరోజు ఇందిరా గాంధీ ఆశయాలు కొనసాగిస్తున్నామని చెప్తూనే, హెచ్.సి.యు భూములను అమ్మకానికి పెట్టడం అన్యాయమన్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల భూములను అమ్ముకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరిని విడనాడాలని హెచ్చరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీడీఎస్యూ అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి బీమ్ సేన్, ఇతర విద్యార్థి నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేసి, భేషరతుగా విడుదల చేయాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించిన 400 ఎకరాలను వెంటనే యూనివర్సిటీ పేరా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నారు. విద్యా సంస్థల భూములను అమ్ముకునే వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని, లేనిచో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు వరుణ్, సాయి, రాజు, నవీన్, రాకేష్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
