. ఐజీ, డీజీపీకి ఫిర్యాదులు
. జేజే డెవలపర్స్ వెంచర్ ఫైనాన్సియర్లపై ఫిర్యాదు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రియల్ రంగంలో హవాలా పెట్టుబడుల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కట్టకుండా, బినామీ పేర్లతో దందా చేస్తున్న వారు కోకోల్లలు. జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు హవాలా మార్గంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్ లో జేజే డెవలపర్స్ పేరుతో వెలిసిన వెంచర్ ఫైనాన్షియర్లపై బాధితుల ఫిర్యాదు మేరకు ఇదివరకే కేసులు నమోదు కాగా, తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గత నెలలోనే ఫిర్యాదులు వెళ్లినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనాకు ముందు మాధవ నగర్- ధర్మారం మధ్యలో 16 ఎకరాల్లో జేజే డెవలపర్స్ పేరుతో వెంచర్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అందులో ప్లాట్ల కొనుగోలుకు చాలామంది అడ్వాన్సులు చెల్లించినప్పటికీ ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేయడానికి డెవలపర్స్ ముందుకు రాలేదు. వెంచర్ డెవలప్ చేసిన వారు ఫైనాన్షియర్ల వద్ద తీసుకున్న అప్పు తాలూకు వడ్డీలు కొండలా పెరిగి సంబందిత భూములను విక్రయదారులనుంచి తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకోవడం కలకలం రేపింది. అయితే బహిరంగ మార్కెట్లో రిజిస్ట్రేషన్ మార్కెట్ రేటు ఒక విధంగా ఉండగా అంతకు కొన్ని రెట్ల విలువైన భూమిని వెంచర్ చేసే క్రమంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు తెలిసింది. డబ్బుల తాలుకా చలామణి అంతా జీరోలో జరగడం, వడ్డీలు మాత్రం కోట్ల రూపాయలు వసూలు చేయడం ఒక ఎత్తయితే దౌర్జన్యంగా సంబంధిత భూములను కబ్జా చేయడం అప్పట్లో కలకలం రేపింది. సదరు ప్రైవేట్ ఫైనాన్షియర్లు అనుమతులు లేకుండానే వడ్డీల దందా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. జేజే డెవలపర్స్ లో ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఫైనాన్షియర్ల రూపంలో జరిగిన ఆటంకాల నేపథ్యంలో కేసులు పోలీస్ స్టేషన్ లో, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందిన విషయం విధితమే. ఈ విషయంలో సుమారు 42 మంది బాధితులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే కొందరు నగరానికి చెందిన ప్రముఖులు రియల్ ఎస్టేట్ లో బినామీలుగా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించిన బాధితులు వారే తమకు చెందాల్సిన భూముల తాలూకు రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటున్నారని, వారిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ర్టార్ మొదలుకొని స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ డీఐజీ వరకు డిచ్ పల్లి సీఐ నుంచి డీజీపీ స్థాయి వరకు బాధ్యులుగా చేస్తూ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతోపాటు జేజే డెవలపర్స్ ఫైనాన్స్ వారి వద్ద తీసుకున్న డబ్బులకు వడ్డీలు పెంచిన విధానాన్ని పరిశీలించి అందులో హవాలా ప్రమేయం ఉందని దానిపై చర్యలు తీసుకోవాలని ఐజీ, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రేపో మాపో విచారణకు పిలిచే అవకాశం ఉంది. నిజామాబాద్ నగరంలో శివారు ప్రాంతాల్లో కొందరు డాక్టర్లు, వ్యాపారవేత్తలు బినామీలుగా వడ్డీ వ్యాపారం మాటున భూములను చెరపట్టారు. వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేకుండానే హవాలా రూపంలో దందాలు చేస్తున్నట్లు తెలిసింది. తొలిసారి నిజామాబాద్ జిల్లా రియల్ ఎస్టేట్ దందాలో హవాలపై ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులు కూడా పొలిటికల్ ఒత్తిళ్లకు లోనైతే మాత్రం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఆర్థిక వ్యవస్థీకృత నేరాల నియంత్రణ) విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
