25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

‘గుడ్డు’ వసూలు చేసింది రూ.10కోట్లు

Must read

📰 Generate e-Paper Clip

. రియల్ పేరుతో అమాయకులకు బురిడీ

. చీటింగ్ కేసు తప్పించుకోవడానికి మిస్సింగ్ కేసు

.  లబోదిబోమంటున్న బాధితులు

నిజామాబాద్, బతుకమ్మ: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశ చూపి జిల్లా  కేంద్రానికి చెందిన గుడ్డు ఏకంగా  రూ.10కోట్లకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. బర్కత్  పురాకు చెందిన గుడ్డు  మోసాలు రోజుకోటి బయటకు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు అంటూ  సుమారు 15 నుంచి 20 మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి కనిపించకుండాపోయాడు. నిజామాబాద్ నగర శివారులో రియల్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నామని, అందులో పెట్టుబడులు పెడితే మిగులుబాటు ఎక్కువగా ఉంటుందని నమ్మించి నట్టేటా ముంచారు. నిన్నమొన్నటి వరకు గుడ్డు వసూలు చేసింది రూ.7కోట్లు అని ప్రచారం జరిగినప్పటికీ.. బాధితులు సంఖ్య ఎక్కువగా ఉందని రూ.10కోట్ల వరకు వసూలు చేశాడని తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం కొంత మంది నుంచి డబ్బులు తీసుకున్నగుడ్డు.. భూముల కొనుగోలు, వెంచర్ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ లు అంటూ తిప్పుకుని పది రోజుల క్రితం నుంచి కనిపించకుండాపోయాడు. డబ్బులు ఇచ్చిన వారు గుడ్డు ఇంటికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బర్కత్ పురాకు చెందిన గుడ్డు కుటుంబ నేపథ్యాన్ని చూసి డబ్బులు ఇస్తే ఎలాంటి భూములు కొనుగోలు చేయకుండానే తమను నట్టేటా ముంచాడని బాధితులు వాపోతున్నారు.

గుడ్డు మిస్సింగ్

డబ్బులు ఇచ్చిన వారు ఇంటికి వస్తుండడంతో ‘గుడ్డు’ కనిపించడం లేదంటూ అతడి కుటుంబ సభ్యులు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్  లో ఫిర్యాదు అందజేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేయడం గమనార్హం. దీంతో తాము ఇచ్చిన డబ్బులు వస్తాయా? రావా? అనే ఆందోళన డబ్బులు ఇచ్చిన వారిలో పెరిగిపోతోంది. చీటింగ్ కేసు నమోదు చేయకముందే కుటుంబ సభ్యులు జాగ్రత్తపడి మిస్సింగ్ కేసు నమోదు చేయించారని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతకు బంధువు కావడంతో గుడ్డును కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి. ప్రధానంగా లక్షలు మొదలుకుని కోటి వరకు ఇచ్చిన వారు కేవలం కుటుంబ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని డబ్బులను పెట్టుబడుల కోసం ఇస్తే మోసం చేశాడని వాపోతున్నారు. నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వారిని కూడా మోసం చేసినట్లు తెలిసింది. కొందరు ఎన్ఆర్ఐల భార్యలు కూడా డబ్బులు ఇచ్చి లబోదిబోమంటున్నారు. ఓ ఎన్ఆర్ఐ తమ వద్ద ఉన్న చెక్కులు, ప్రామిసరీ నోట్లతో చీటింగ్ కేసు నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల గుడ్డును కాపాడేందుకు చావూస్ అనే లీడర్ పైరవీ చేయడం విశేషం.

అపార్ట్ మెంట్ లో ‘గుడ్డు’

నగరంలోని ఓ అపార్ట్ మెంట్ లో గుడ్డు ఉన్నాడని, ఎక్కడికీ వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. గుడ్డుపై క్రిమినల్ కేసులు లేకుండా చేయడానికి ఎంతో కొంత ఇచ్చి గొడవలు జరగకుండా ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. గుడ్డు మిస్సింగ్ కు ముందు ఒక వీడియోను కుటుంబ సభ్యులకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోలో తాను డబ్బుల కోసమే బయటకు వెళ్తున్నానని, సర్దుబాటు కాగానే వస్తానని లేకపోతే తిరిగి రానని అంటున్నట్లు వీడియోను రూపొందించి కుటుంబ సభ్యులకు పంపినట్లు తెలిసింది. ఆ వీడియో ఆధారంగానే ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు సమాచారం.

More articles

Latest article