24 C
Hyderabad
Sunday, August 2, 2026

జీపీ కార్మికుల వేతన సమస్యలు పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ :  తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు టోకెన్ సమ్మెలో భాగంగా గురువారం ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.ముత్తెన్న, ఎం.సుధాకర్, యూనియన్ రాష్ట్ర నాయకులు ఆర్.రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,740 గ్రామపంచాయతీల్లో సుమారు 60వేల మంది కార్మికులు వివిధ కేటగిరీలల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి నెలలు తరబడి జీతాలు రాకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మెజారిటీ గ్రామపంచాయతీలో 5,6 నెలలుగా వేతనాలు పెండింగులో ఉన్నాయన్నారు. వెంటనే పెండింగులో ఉన్న వేతనాలను విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా వారికిచ్చే చాలీచాలని జీతాలతో రోజులు గడవడం కూడా కష్టమవుతుందన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. పీఎఫ్, ఈ.ఎస్.ఐ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు, ప్రభుత్వ ఉద్యోగుల తరహా 30% పీఆర్సి పెంపు అమలు చేయాలని, అలాగే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కారోబార్లను జూనియర్ కార్యదర్శులుగా నియమించాలని,  ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల 5వ తేదీ లోపు జీతాలను వారి బ్యాంకు ఖాతాలలో వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల  నిర్లక్ష్యాన్ని విడనాడాలన్నారు.   వారి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ  జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్, రాష్ట్ర నాయకులు సత్తెక్క, జిల్లా నాయకులు బి.మురళి, కిరణ్, నాయకులు అరవింద్, రాజేశ్వర్, సాయిబాబా, నిఖిల్ జీపీ కార్మికులు  ఆశన్న, లాలయ్య, నాగరాజు, సాయిలు,  మల్కయ్య, దుర్గ, రమేష్, రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article