నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి టీయూసీఐ విప్లవ జేజేలు తెలుపుతుందని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపును జయప్రదం చేసిన జిల్లాలోని కార్మిక వర్గానికి టీయూసీఐ జిల్లా కమిటీ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి పైగా కార్మికులు సార్వత్రిక సమ్మెలో ఉత్సాహంగా పాల్గొని కార్మికశక్తిని తెలియజేశారన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి కార్మిక వ్యతిరేక 04 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు 26వేలు, కనీస పెన్షన్ 9వేలు అమలు చేయాలని, పనిగంటల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో టీయూసీఐ జిల్లా కోశాధికారి పి.సాయరెడ్డి, జిల్లా నాయకులు కిరణ్, రవికుమార్ లు పాల్గొన్నారు.
