27.5 C
Hyderabad
Friday, July 31, 2026

గంజాయా? ఎస్కేపా?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సెంట్రల్ జైలులో జరిగిందేమిటి?

. . . జైలులో సర్చింగ్ కమిటీ విచారణ

నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ సెంట్రల్ జైలులో డిసెంబర్ 27న ఏం జరిగిందనేది తేల్చేందుకు జైళ్ళ శాఖ సిద్దమైంది. జైలులో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడిన ఘటనలో ఎగ్జిక్యూటీవ్ జైలర్ గా ఉన్న ఉపేందర్ ను సస్పెండ్ చేయగా, వెల్పేర్ జైలర్ గా ఉన్న సాయిసురేష్ ను బదిలీ చేసిన విషయం తెల్సిందే. సెంట్రల్ జైలులో నిర్లక్ష్య విధులను నిర్వహించిన సూపరింటెండెంట్ దశరథంపై చర్యలకు సిఫారసు చేశారు. గతంలోనూ సూపరింటెండెంట్ దశరథంపై చర్లపల్లి డిప్యూటీ జైలర్ గా ఉన్నప్పుడు లైంగిక ఆరోపణలపై సస్పెన్షన్ కు గురైన విషయం తెల్సిందే. కామారెడ్డి సబ్ జైలులో మహిళ ఉద్యోగిని వేదించిన ఉదంతం గతేడాది వెలుగు చూసిన విషయం విధితమే. అయితే నిజామాబాద్ సెంట్రల్ జైలులో జరిగిన ఉదంతం ఏమిటనే విషయాన్ని తేల్చేందుకు జైళ్ళశాఖ సెర్చ్ టీంను రంగంలోకి దించింది. వరంగల్ సెంట్రల్ జైల్ అనుబంధంగా కొనసాగుతున్న ఓపెన్ ఎయిర్ జైలర్ గణేష్ ఆధ్వర్యంలో 10 మంది టీం నిజామాబాద్ సెంట్రల్ జైలులో తిష్టవేసి కూపీలాగే పనిలో పడింది.

 

గతేడాది నిజామాబాద్ సెంట్రల్ జైలులో డిసెంబర్ 27న గంజాయి పొట్లాలు గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీసర్స్ స్పాట్ వైపు నుంచి జైలులోకి విసిరివేయడంతో దాని కోసం అందులో ఇద్దరు ఖైదీలు కర్నెలింగం, చాకలి రాజులు కోట్లాడుకున్నారని ఈ ఘటనలో వారిని జైలు అధికారులు చితకబాదడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది బోధన్ మేజిస్ట్రేట్ వద్ద ఇద్దరు ఖైదీలు వాయిదా కోసం వెళ్లినప్పుడు చెప్పిన మాట. దాని ప్రకారమే మేజిస్ట్రేట్ ఇద్దరు ఖైదీలను సెంట్రల్ జైలు నుంచి కామారెడ్డి సబ్ జైలుకు బదిలీ చేశారు. అయితే మేజిస్ట్రేట్ వద్ద జైలర్ ఉపేంధర్ మాత్రం ఖైదీలు ఉదయం వేళ జైలు నుంచి పారిపోయేందుకు యత్నించగా పట్టుకునే ప్రయత్నంలోనే వారు గాయపడ్డారని వారిపై చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. దానితో మేజిస్ట్రేట్ సెంట్రల్ జైలులో జరిగిన ఉదంతాన్ని జైళ్ళ శాఖ డీజీకి సమాచారం అందించిన విషయం తెల్సిందే. జైళ్ళ శాఖ డీజీ ఆదేశాల మేరకు ఐజీ, డిఐజీలు సంపత్, మురళిబాబులు ముందుగా కామారెడ్డి సబ్ జైలుకు బదిలీ అయిన ఇద్దరు ఖైదీలను విచారించారు. తర్వాత ఈ నెల 3న నిజామాబాద్ సెంట్రల్ జైలులో విచారణ జరిపారు. వారిచ్చిన నివేదిక ఆధారంగానే ఇద్దరు అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. మరొకరిపై చర్యలకు సిఫారసు చేసిన విషయ తెల్సిందే.

 

నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఖైదీలు పరారీ అయ్యేందుకు ప్రయత్నించారని అధికారులను బోల్తా కొట్టించే పని చేశారన్న వాదనలున్నాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఖైదీలు ఎవ్వరు ఆ సాహసం చేయరన్న విషయం జైలు అధికారులకు తెలుసు. అంతేగాకుండా జైలులోకి నిషేదిత మత్తు పదార్థాలు అధికారుల క్వార్టర్స్ వైపు నుంచే జైలులోకి విసిరివేసినట్లు ఉండడంతో అధికారుల వైపే అన్నీ వేళ్ళు చూపుతున్నాయి. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, రిమాండ్ ఖైదీలకు క్యాంటిన్ నుంచే తినుబండారాలు అనుమతిస్తారు. కానీ అవి తీసుకోవాలన్నా ఖైదీల వద్ద డబ్బులు లేకపోతే డిపాజిట్ చేయించే కల్చర్ ఉంది. జైలులో గంజాయికి అలవాటుపడ్డ వారి కోసమే గంజాయిని విసిరేసారన్న వాదనలున్నాయి. ఈ విషయంలో జైలు అధికారులు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి జిల్లా ఎస్పీ ద్వారా విచారణ కోరాల్సి ఉండగా వారే కల్పించుకుని ఖైదీలను చితకబాదడం ఏమిటని వాదనలున్నాయి. జైలులో ఇద్దరు ఖైదీలు గంజాయి కోసం కోట్లాడి గాయపడ్డారని సబ్ జైలుకు మార్చితే మిగితా 8 మందిని సంబంధం లేకుండా ఇతర జైలుకు పంపించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైళ్ళ శాఖాధికారులు సెంట్రల్ జైలును పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆరుగురు అధికారుల కనుసన్నుల్లో 540 నుంచి 600 మంది ఖైదీల పరిశీలన ఎలాజరుగుతుందో పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం జైళ్ళ శా ఖ సెర్చ్ కమిటీ చేస్తున్న పరిశోధనలు సెంట్రల్ జైల్ అధికారుల అవినీతి, అక్రమాలు, అధికారు దుర్వినియోగం బహిర్గతమౌతుందో లేదో వేచి చూడాలి.

More articles

Latest article