. . . ముగ్గురు అరెస్టు . . . ఒకరు పరారీ
. . . 30 కిలోల కాపర్ వైర్ స్వాధీనం
భిక్కనూర్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాను వణికించిన ట్రాన్స్ ఫార్మర్ దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. గత 5 నెలలుగా భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్, గుర్రకుంట, రామేశ్వరపల్లి, జంగంపల్లి, ర్యాగటపల్లి తో పాటు రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ట్రాన్స్ ఫార్మర్ చోరీలు జరుగుతున్నాయని ట్రాన్స్ కో ఏఈ జాదవ్ బాలాజీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారన్నారు. దర్యాప్తులో భాగంగా డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో భిక్కనూర్ సీఐ జె. నరేష్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్ నేతృత్వంలో 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సీసీ పుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుల కదలికలను ట్రేస్ చేయగా గురువారం అర్ధరాత్రి మళ్ళీ చోరీకి వచ్చిన ముఠా కదలికలను గమనించిన పోలీసులు భిక్కనూర్ లోని పరివార్ హోటల్ దగ్గర వల వేసి శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురిని పట్టుకున్నారు. వారిని బల్బీర్ సింగ్, రూప్ సింగ్, లకన్ గా గుర్తించారు. వీరంతా సొంత అన్నదమ్ములు కాగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ ముఠా ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 29 చోట్ల, మెదక్ జిల్లాలో 23 చోట్ల చోరీలు చేసింది. మొత్తం 52 ట్రాన్స్ ఫార్మర్ చోరీలతో పాటు ఒక హత్యాయత్నం, ఒక ఇంటి దొంగతనంలో వీరి హస్తం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. అయితే బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి శివారులో చోరీ చేస్తుండగా అడ్డుకున్న అసిస్టెంట్ లైన్ మెన్ ప్రభాకర్ పై కూడా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై సెప్టెంబర్ 9న భిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిపారు. అయితే విచారణలో దొంగతనాల కారణం ఆన్ లైన్ బెట్టింగ్, విలాసాలకు డబ్బు కోసమే ఈ దొంగతనాలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. పగలు రెక్కీ చేసి రాత్రి చోరీలకు పాల్పడేవారని వెల్లడించారు. గతంలో కూడా జైలుకు వెళ్లి వచ్చారని వారి వద్ద నుండి 30 కిలోల కాపర్ వైర్, యమహా ఎఫ్ జెడ్ బైక్, కట్టర్లు, పానాలు, రింగ్ పానాలు, రాడ్లు, ఆక్సర్ బ్లేడ్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించమని ఎస్పీ తెలిపారు.
