భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలో విద్యుత్ సరఫరా తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రీ ఫేస్ కరెంటు సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ పెద్ద మల్లారెడ్డి, కంచర్ల గ్రామాల రైతులు శుక్రవారం పెద్ద మల్లారెడ్డి సబ్ స్టేషన్ ను ముట్టడించారు. వోల్టేజ్ సరిగా లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా 3 ఫేస్ కరెంటు సరిగా ఇవ్వడం లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.విషయం తెలుసుకున్న ట్రాన్స్ కో అధికారులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. రైతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని ట్రాన్స్ కో ఏఈ సంకీర్త్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెనుదిరిగారు.
