కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న కామారెడ్డి పట్టనంలోని అశోక్ నగర్ కాలనీలోని ఐదు గుడిలలో జరిగిన దొంగతనాలపై ఆలయ చైర్మన్ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టి హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 5, దేవునిపల్లి పరిధిలో 3, భిక్కనూర్, రామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 11 దొంగతనాలు చేసినట్లు తేలిందన్నారు. 11 కేసుల్లో కామారెడ్డి, దేవునిపల్లి, భిక్కనూర్ పీఎస్ పరిధిలో మూడు ఆలయాల్లో చోరీ కేసులున్నాయని తెలిపారు. కామారెడ్డి పట్టణానికి చెందిన నిమ్మలవోయిన సురేష్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన గణేష్, ఎడపల్లి మండలం తాడెం గ్రామానికి చెందిన గాజుల శ్రీధర్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.4లక్షల విలువైన మూడు గ్రాముల బంగారం, మూడు బైకులు, రెండు మైక్ సెట్లు, ఒక ఆటో, ఒక మేక, 7జతల వెండి కండ్లు, ట్రాక్టర్ బ్యాటరీ, సెల్ ఫోన్ రికవరీ చేశామని తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీరాం, సిబ్బంది పాల్గొన్నారు.

