హైదరాబాద్, బతుకమ్మ : బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ’ (బీసీ- జేఏసీ) ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరిట ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బంద్ లో ముందు వరుసలో ఉండి పోరాడుతామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టతతో పని చేయాలని సిపిఎం నేతలు సూచించారు. మంగళవారం ఉదయం ‘బంద్ ఫర్ జస్టిస్ ‘ కు మద్దతు ఇవ్వాలని కోరుతూ బీసీ చాక్ నాయకులు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, రాజారాం యాదవ్, గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ లోడ్ లోని సీపీఎం కార్యాలయంలో బీసీ జేఏసీ నేతలు జాన్ వెస్లీకి లేఖను అందజేశారు. ఈ నెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన జస్టిస్ ఫర్ బంద్ కు మద్దత్తు ఇవ్వాలని చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. వ్యవస్థలు అన్నీ బీసీలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని ఆరోపించారు. బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. న్యాయబద్ధమైన, బీసీల ధర్మ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. బీసీలకు జీవన్మరణ సమస్య మారిన ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని రాజారామ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కోఆర్డినేటర్లు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
