బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకుల నియామకం జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఎంసెట్ లో పదివేల పైన ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా బీటెక్ సీట్ ను కేటాయించనుందని, పదవ తరగతి పాసైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, లెక్చరర్ అక్కం విష్ణు లు కోరారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో 2023 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేసిందని, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 53 మంది విద్యార్థులు చేరారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి విద్యా సంవత్సరంలో ఇద్దరూ లెక్చరర్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం మరో 9 మంది లెక్చరర్ లను నియమించడంతో పూర్తిస్థాయిలో అధ్యాపకులు ఉన్నారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ ఇ సి గ్రూపులలో ఇంగ్లీష్, తెలుగు మీడియాలలో బోధన ఉంటుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు పుస్తకాలు, ఉచిత బస్సు సౌకర్యం, స్కాలర్ షిప్ లు వస్తాయన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నూతనంగా 35 మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధ్యాపకులను కేటాయించినందున విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ నాణ్యమైన బోధనను అందించి, ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను తీర్చిదిద్ది ఉత్తమ ఫలితాలను సాధిస్తాం అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పదవ తరగతి పాసైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
