- తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మికుల మెడకు ఉరితాడు లాంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీవో కార్యాలయంలో ఇన్చార్జి డిటిఓ రాహుల్ కుమార్ కు సమ్మె నోటిస్ అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, మొత్తం రవాణా రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు పూనుకుంటున్నదని అన్నారు. కార్మికవర్గం రక్తం చిందించి 100 సంవత్సరాల క్రితం నుండి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసే, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చిందని తెలిపారు. ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మికుల హక్కులను హరించి, కార్మికుల్ని బానిసలుగా చేసేందుకు బిజెపి ప్రభుత్వం పూసుకుంటుందన్నారు. అందుకే కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి కొట్టి, మన సమస్యల పరిష్కారానికై, రవాణా రంగాన్ని రక్షించడానికి, ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 మే 20న దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, రోడ్డు రవాణా కార్మిక సంఘాల అఖిల భారత సమన్వయ కమిటీ పిలుపునిచ్చాయన్నారు. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కెఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించి, సమ్మె రోజున గ్రామీణ బంద్కు పిలుపునిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని రోడ్డు రవాణా రంగంలో పనిచేసే ఆటో, క్యాబ్, డిసిఎం, లారీ, ట్రాలీ, మినీ డిసీఎం, టాటా ఎసి, ట్రాక్టర్, అంబులెన్స్, స్కూల్ బస్సు, ట్రక్కు, ప్రొక్లైనర్, వరికోత మిషన్, జెసిబి, బోర్ బండి, టూరిస్ట్ బస్సు, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు, క్లీనర్స్, మెకానిక్స్, ఆపరేటర్లందరూ పెద్దఎత్తున మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
