. . . 29 పాత కార్మిక చట్టాలు అమలు చేయాలి
. . . యూటియూసి నాయకులు కటారి రాములు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఈ నెల 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో గల ఆర్ ఎస్ పి పార్టీ కార్యాలయంలో యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు పూర్తిగా యాజమాన్యులకు రక్షగా, కార్మికులకు శిక్షగా మారాయని, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటివరకు అమలులో ఉన్న 29 పాత కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని కోరారు. కార్మికుల జీవన వ్యయం విపరీతంగా పెరిగిన దృష్ట్యా కనీస వేతనం రూ.26,000 గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన అన్ని రకాల నష్టపరిహారాలు వెల్ఫేర్ బోర్డు నుండే తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే అన్ని రంగాల కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని, కార్మికుల ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ పరీక్షలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు రోజుకు 8 గంటల పని విధానం అమలయ్యేలా, శ్రమకు తగిన వేతనం చెల్లించే విధంగా చట్టాలు అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడిచిపెట్టి, కార్మికులకు అనుకూలమైన చట్టాలను తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ, ఈ లక్ష్యాల సాధన కోసం సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ల నరేష్, మినీ ట్యాంక్ బండ్ ఆటో స్టాండ్ నాయకులు సయ్యద్ ఇర్ఫాన్, ఫులంగ్ ఆటో స్టాండ్ నాయకుడు వినోద్ గౌడ్, ఖిల్లా చౌరస్తా ఆటో స్టాండ్ నాయకులు మహమ్మద్ నిజాముద్దీన్, వినాయక్ నగర్ ఆటో స్టాండ్ నాయకులు బాల ముకుందం, హమాల్వాడి ఆటో స్టాండ్ నాయకులు పోడాల శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.
