నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన దండు నర్సింలు, దండు శివరాములు, దండు అంజయ్య, దండు గణేష్లకు ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ ఒక్కరికి రూ.5,000 చొప్పున, మొత్తం రూ.20,000 జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే, 2019లో నీల సిద్ధిరాములు అనే వ్యక్తితో ఇంటి వివాదం కారణంగా ఈ నలుగురి మధ్య ఘర్షణ జరిగింది. ఘటనపై అప్పటి నాగిరెడ్డిపేట్ ఎస్సై మోహన్ నీల సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో విచారణ సందర్భంగా, కోర్ట్ కానిస్టేబుల్ వినోద్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి సాక్షులను సమయానికి హాజరుపరిచారు. దీంతో విచారణ వేగవంతమై, తీర్పు ఆలస్యం కాకుండా సకాలంలో వచ్చింది. సాక్ష్యాలు, వాదనలు విన్న అనంతరం, న్యాయమూర్తి నిందితులకు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. జరిమానా మొత్తాన్ని చెల్లించిన అనంతరం నిందితులు ఇంటికి వెళ్లారు. ఈ విషయంపై వివరణ కోరగా, ప్రస్తుత నాగిరెడ్డిపేట్ ఎస్సై భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ, చట్టానికి, న్యాయానికి ఎవరూ మించి ఉండలేరు. వివాదాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరికగా తెలిపారు. స్థానికులు ఈ తీర్పును స్వాగతిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.